కమలేష్ నిద్దట్లోంచి దిగ్గున లేచాడు! ఏదో కల వచ్చింది. అందులో తనతో తానే కొట్లాడుకుంటున్నట్లు అనిపించింది! తనతో తానే కొట్లాడటం ఏమిటీ? అంతా భ్రాంతి! తాను అతిపెద్ద దేశభక్తుడు. అంతకుమించి నమో భక్తుడు. తాను కొట్లాడితే, గిట్లాడితే దేశ ద్రోహులతో కొట్లాడుతాడు! అనుకుంటూ ముసుగు తన్ని పడుకోబోయాడు! ఆశ్చర్యం! తన ఎదురుగా మంచం మీద తానే కూర్చొని ఉన్నాడు. ఇందుకు ముందైతే కల వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నది ఏమిటి? ఇది కూడా భ్రాంతియేనా? అని అనుకుంటూ చేయిని గిచ్చుకోబోయాడు!
”ఆగు! గిచ్చుకోనవసరంలేదు! నీ ఎదురుగా కూర్చున్నది నీ మనసు! అంటే నీ మనసులో ఏముందో నీకే చెప్పటానికి బయటకు కనబడుతున్నాను!” అని ఎదురుగా ఉన్న ఆకారం అలియాస్ మనసు నుండి మాటలు వచ్చాయి!
”నా మనసులో పెద్దాయన ఉన్నాడు! వస్తే గిస్తే ఆయన బయటకు రావాలి! కాని వీడెవడో బయటకు వచ్చి నేనే అంటాడేమిటి?” అనుకున్నాడు కమలేష్!
మనసు చిన్నగా నవ్వింది!
”నీ మనసులో పెద్దాయన ఉన్న సంగతి తెలుసు! కాని నీ మనసుకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి! వాటికి సమాధానాలు కావాలి! నీవే చెప్పాలి!” అన్నది మనసు!
”సరే! నీ అనుమానాలు ఏమిటో అడుగు?” అన్నాడు కమల్.
”నీవు హిందువేనా కాదా!” అడిగింది మనసు.
”అదేం పిచ్చి ప్రశ్న! నేను ఖట్టర్ హిందువునే! మళ్లీ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకు!” అన్నాడు కోపంగా కమలేష్.
”ఈ దేశం, హిందువులు, ప్రమాదంలో ఉన్నారని పెద్దాయనను గెలిపించటానికి నీవు తీవ్రమైన కృషి చేశావు కదా!” అడిగింది మనసు.
కమలేష్‌కి సిగ్గయింది! తన మనసు తన కృషిని గుర్తించింది!
”మరి నీకృషి ఫలించి, పెద్దాయన గెలిచాడు కదా! ఇప్పుడు అంతా బాగుందనుకుం టున్నావా?” అడిగింది మనసు!
”నిజం చెప్పాలంటే 2014 తర్వాతే మన దేశానికి స్వతంత్రం వచ్చింది! ఇప్పుడు ఇది వికసిత భారత్!” గర్వంగా చెప్పాడు కమలేష్.
”ముందు జీఎస్టీ తీసుకొచ్చారు! మూడ్నెల్ల జీఎస్టీ పన్ను తగ్గించామని ‘జీఎస్టీ బచావ్’ ఉత్సవాలు జరిపారు! ప్రతి ఇంటికి కనీసం పది వేల వరకు పన్నులు తగ్గుతాయని ప్రచారం చేశారు! మరి మూడ్నెల్ల నుండి నీ వద్ద 30 వేల రూపాయలు జమయ్యాయి! కదా! వాటినేం చేశావు?” అడిగింది మనసు.
కమలేష్‌కి ఏం చెప్పాలో తోచలేదు! జీఎస్టీ తగ్గినా తాను చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం తగ్గలేదు. కనుక 30 వేల రూపాయలు కాదుగదా మూడు వేలు కూడా మిగలలేదు! అందుకే వాస్తవం చెప్పక తప్పలేదు!
”జిఎస్టీ తగ్గినా డబ్బులు మిగలలేదు!” అన్నాడు కమలేష్.
”పెద్దాయన అధికారంలోకి వస్తే పెట్రోలు రూ.50 అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు! కాని ఇప్పుడు లీటరు పెట్రోలుకి రూ.100 దాటిపోయింది! దీనివల్ల నీ ఆదాయంలో పెట్రోలుకి పెట్టే ఖర్చు డబుల్ అయ్యింది కదా! నీ ఆదాయంలో కూడా భారీ పెరుగుదల లేదు! దీనివల్ల నీ కుటుంబానికి నష్టం జరుగుతుందా? లేదా?” అడిగింది మనసు.
కమలేష్ మళ్లీ ఇబ్బంది పడ్డాడు!
పెట్రోలు ధరలు తగ్గకపోగా.. డబుల్ అయ్యింది నిజమే! కాని ఒక దేశభక్తుడిగా ఆ విషయం బయట చెప్పుకోలేని పరిస్థితి! తక్కువ ధరకు రష్యా, ఇతర దేశాలవద్ద కొంటున్నట్లు చెబుతూనే, పెట్రోలు ధరలు పెంచుతూనే ఉన్నారు! ప్రపంచంలో ముడిచమురు ధర కూడా 2014కు ముందున్న ధర కంటే తగ్గిపోయింది! ఇన్ని చేస్తున్నా ధరలు ఎందుకు తగ్గటం లేదో తెలియటం లేదు! ముడిచమురు శుద్ధి చేస్తున్న అంబానీకే లాభం అంతా వెళ్లిపోతుంది అని ఎవరైనా అంటే తాను మేకపోతే గాంభీర్యంతో, దబాయిస్తున్నాడు గానీ, తనకు తన కుటుంబానికి పెట్రోలు కొనటం భారంగానే ఉంది!
”అవును!” అన్నాడు కమలేష్ తన మనసు ముందు తలదించుకుని.
”బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాలు వచ్చారని ప్రచారం చేశారు! ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడిని షారూఖ్‌ఖాన్ ఐపీఎల్‌కి తన టీములోకి తీసుకున్నారని ట్రోల్ చేస్తున్నారు కదా!” అని మనసు అంటూండగానే
”అది పెద్ద దేశ ద్రోహం! బంగ్లాదేశ్‌లో మన హిందువులను కాల్చి చంపుతున్నారు! ఏ ముస్లిం అయినా మనకు శత్రువులే! వారిని తన్ని తగలేయాలి!” అన్నాడు కమల్ ఆవేశంగా.
మరోసారి చిన్నగా నవ్వింది మనసు!
”మరి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు మన పెద్దాయన ఆశ్రయం ఎందుకిచ్చారు? ఇతర ముస్లిం దేశాల వద్దకు వెళ్లి వారు ఇచ్చే విందులు ఎందుకు ఆరగిస్తున్నారు? ముస్లిం దేశ నాయకులు ఇచ్చే బిరుదులు ఎందుకు స్వీకరిస్తున్నారు?” నిలదీసింది మనసు!
కమలేష్‌కి కళ్లు తిరిగాయి! వేరే వారెవరైనా ఇలాంటి ప్రశ్నలు వేస్తే, విధివిధానాలని, కొన్ని తప్పవని, దాటవేసేవాడు. ఇంకా గట్టిగా అడిగితే మీరు దేశద్రోహులని ఎదరుదాడి చేసేవాడు! కాని ఇప్పుడు అడుగుతున్నది తన మనసు! అన్ని విషయాలు తెలిసిన తన మనసే! దేశద్రోహి అంటూ తన మనసుపైనే ఎలా దాడి చేయగలడు?
”ముస్లింలే ఈ దేశానికి నష్టం కలిగిస్తున్నారని, నీవే ప్రచారం చేస్తున్నావు! అది మీ పార్టీ సిద్ధాంతం అని చెబుతున్నావు! మీ పార్టీ అగ్రనాయకులు దాదాపు పదిహేను మంది ముస్లింలను అల్లుళ్లుగా చేసుకున్నారు కదా! మరి మీ సిద్ధాంతం తప్పా? లేక మీ నాయకులు తప్పు చేశారా? మీ సిద్ధాంతం తప్పు అయితే అది ఒప్పుకోండి! మీ నాయకులు తప్పు చేస్తే, వారిని మీ పార్టీ నుండి బహిష్కరించండి! ఈ రెండింటిలో నీవు ఏది చేస్తావు?” అడిగింది మనసు!
తలపట్టుకుని కమలేష్ బయటకు పరుగెత్తాడు!
- ఉషాకిరణ్



