ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ (ఫ్రాన్స్) : డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో సీడ్, ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెటితో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 4-6, 7-6(7-3), 6-0, 2-0తో పైచేయి సాధించిన అల్కరాస్ టైటిల్ పోరుకు చేరుకున్నాడు. తొలి సెట్‌లో పైచేయి సాధించిన ముసెటి.. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయాడు. మూడో సెట్‌ను 6-0తో అల్కరాస్ అలవోకగా సొంతం చేసుకున్నాడు. నాల్గో సెట్లో 2-0తో అల్కరాస్ ముందంజలో నిలువగా.. తొడ కండరాల గాయంతో లొరెంజో ముసెటి వాకోవర్ ఇచ్చాడు. మూడో సెట్‌లోనే గాయంతో ఇబ్బంది పడిన ముసెటి.. నాల్గో సెట్లో రెండు గేముల తర్వాత.. ఆడలేనని చెప్పేశాడు. ఓ ఏస్, ఆరు బ్రేక్ పాయింట్లు సాధించిన కార్లోస్ అల్కరాస్ పాయింట్ల పరంగా 104-79తో తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. పురుషుల సింగిల్స్ మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ జానిక్ సినర్, ఆరో సీడ్ నొవాక్ జకోవిచ్ తలపడుతున్నారు. ఇక నేడు జరుగనున్న మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో వరల్డ్ నం.1 అరినా సబలెంక, రెండో సీడ్ కొకొ గాఫ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగు సార్లు చాంపియన్ ఇగా స్వైటెక్‌ను సెమీస్‌లో చిత్తు చేసిన సబలెంక నేడు ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
ఫైనల్లో అల్కరాస్
- Advertisement -
- Advertisement -