నవతెలంగాణ – హిమాయత్ నగర్
పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ కృషి చేయాలని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.యూసుఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ సహకారంతో ఏర్పాటు చేసిన మట్టి గణపతులను మంగళవారం హిమాయత్ నగర్ లోని ఎన్.సత్యనారాయణరెడ్డి భవన్ ఎదుట ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ.యూసుఫ్, కల్లూరు ధర్మేంద్రలు మాట్లాడుతూ మట్టితో చేసిన వినాయకులను ప్రోత్సహించాలని, రసాయనాలతో చేసిన విగ్రహాలు అందంగా కనిపించిన పూజల అనంతరం వాటిని చెరువులు నాళాలలో నిమజ్జనం చేయడం వలన నీరంతా కలుషితమై నీటి రంగు మారడమే కాక తాగడానికి పనికి రావన్నారు.
పైగా ఆయా చెరువులు నాళాలలో ఉండే చిన్న జీవులు తాగడానికి ఇబ్బంది పడతాయని ఆయన వివరించారు.పూజలు అందుకున్న మట్టి వినాయక విగ్రహాలను మన ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ నీటిని మొక్కల కుండీలలో పోయాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకున్న వారం అవుతామని పేర్కొన్నారు.ఇటు వంటి విషయాలు పిల్లలకు తెలియజేసి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.నగరంలో వైభవంగా నిర్వహించుకొనే వినాయక చవితి పండుగ సందర్భంగా అందరూ ఇండ్లలోనూ, అపార్ట్మెంట్స్ కాలనీ, బస్తీల్లో సామూహికంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు.
నగరంలో కాలుష్యం పెరగకుండా అందరూ తమవంతు కృషి చేయాలని కోరారు.మానవ సమాజ మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరముందన్నారు.పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్, ఖైరతాబాద్ అధ్యక్షులు కళ్యాణ్, సీపీఐ హైదరాబాద్ జిల్లా నేత చెట్టుకింది శ్రీనివాస్, నేతలు వంశీ, అరుణ్, అశోక్, ప్రతిమ, కీర్తి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.