ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం
కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రజలకు రక్షణ కవచం లేనట్టే
హక్కులు, చట్టాలను రద్దు చేస్తున్న మోడీ సర్కారు
ప్రశ్నించేవారిపై అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేయడం దుర్మార్గం మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటాలు : సీపీఐ వందేండ్ల ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోని ఎర్రజెండాలన్నీ ఏకమై ఒకే జెండాగా మారి ఢిల్లీ ఎర్రకోటపై ఎగరేయాలని ప్రజలు కోరుకుంటున్నారనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రస్తుతం అను భవిస్తున్న చట్టాలు, హక్కులు ఉండేవే కాదనీ, కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రజలకు రక్షణ కవచం లేనట్టేనని స్పష్టం చేశారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు పోరాడి సాధించు కున్న హక్కులను, చట్టాలను రద్దు చేసుకుంటూ పోతున్నదని విమర్శించారు. మోడీ తప్పుడు విధానాలను ప్రశ్నించేవారిపై అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలను నిర్వ హిస్తామని ప్రకటించారు. మహనీయుల ఆశయాలతో సీపీఐ ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.
‘సీపీఐ వందేండ్ల ఆవిర్భావ దినోత్సవ సభ’ను హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సీపీఐ పతాకాన్ని కూనంనేని ఎగురవేశారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నర్సింహ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ…సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ప్రపంచ పుట్ట ల్లో లిఖించదగిందన్నారు. జైలులోనే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టిందనీ, పుట్టుకలోనే పార్టీ గొంతు నులిమేయాలని ప్రయత్నించారని గుర్తుచేశారు. ఉరితీసినా, యావజ్జీవ శిక్ష లు విధించినా, కుట్ర కేసులు పెట్టినా కమ్యూనిస్టు నేతలు వెనుకడుగు వేయలేదన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ లాంటి తిరోగమన శక్తులు, కార్పొరేట్లకు ఊడిగం చేసే సిద్ధాంతం కలిగిన వాళ్లు కమ్యూనిజం అంటేనే ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు. పేదరికం లేకుండా చేస్తామని చెప్పాల్సిన ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజలను చైతన్యం చేసే శక్తి ఎర్రజెండాకు ఉన్నదని, అందుకే కమ్యూనిస్టులను చూసి బీజేపీ వణికిపోతున్నదని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టులు మూడు వేల గ్రామాలను విముక్తి చేశారని గుర్తు చేశారు. గ్రామాలన్నీ కమ్యూనిస్టుల వశమైపోతున్నాయని నిజాం నవాబు స్వయంగా పటేల్‌ను ఆహ్వానించి దేశంలో విలీనం చేశారని గుర్తుచేశారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, నినాదాలను ఉచ్చరించకుండా ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోనికి రాలేదని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆ రాజకీయ పార్టీల ఏజెండాలు మారుతున్నాయని ఎత్తిచూపారు. అందరికీ విద్య, వైద్యం అనే నినాదంతో కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం పని చేస్తున్నదనీ, అతి పేదరిక నిర్మూలన రాష్ట్రంగా కేరళ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
జాతీయ కార్యదర్శి కె.రామకృష్న మాట్లాడుతూ.. ఇటీవల వందేండ్ల ఉత్సవాలను పూర్తి చేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ తరపున ఒక్కరైనా జైలుకు వెళ్లారా? ఏనాడైనా నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి నిరోధక, మతోన్మాద శక్తులను ఎదురించేందుకు కమ్యూనిస్టులందరూ ఏకం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నేత సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర నాయకులు బొమ్మగాని ప్రభాకర్, రమావత్ అంజయ్యనాయక్, ప్రేంపావని, ఎన్.జ్యోతి, ఎం.నర్సింహ, బి.వెంకటేశం, నండూరి కరుణకుమారి, కలకొండ కాంతయ్య, పల్లె నర్సింహ, ఉప్పలయ్య, వలీ ఉల్లా ఖాద్రీ, కసిరెడ్డి మణికంట రెడ్డి, పుట్ట లక్ష్మణ్, ఉజ్జిని రత్నాకర్, స్టాలిన్, తదితరులు పాల్గొన్నారు.



