అధ్యాపక, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయండి
విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యం కల్పించండి : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లోని సమస్యల పరిష్కారం కోసం రూ.రెండు వేల కోట్లు వెంటనే కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ఓయూ సమస్యల పరిష్కారం కోసం గతంలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం నిధులను విడుదల చేయాలని కోరారు.
వందేండ్ల చరిత్ర కలిగిన ఓయూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యానికి గురైందని తెలిపారు. గతంలో రేవంత్‌రెడ్డి ఓయూ పర్యటనకు వచ్చిన సందర్భంగా సమస్యలన్నింటినీ పరిష్కరి స్తానంటూ హామి ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఓయూకి వెళ్తున్నందున ఆయనకు అభినందనలు తెలిపారు. వేలాది మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే విధంగా అన్ని రంగాల్లో ఆధునీకరణ కోసం రూ.రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఓయూలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొండి
- విశ్వవిద్యాలయంలోని సమస్యల పరిష్కారం కోసం రూ.రెండు వేల కోట్లు వెంటనే కేటాయించాలి.
- వర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
- పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యంతోపాటు, పీజీ విద్యార్థులకు రూ.8 వేలు, పీహెచ్‌డీ పరిశోధక విద్యార్థులకు రూ.25 వేలు ఫెలోషిప్ ఇవ్వాలి.
- గత పాలకులు వర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నిబంధనలను ప్రయోగించారు. వర్సిటీ అనేది భావ సంఘర్షణ కేంద్రం. వాటి స్వయం ప్రతిపత్తిని పరిరక్షించే విధంగా ప్రభుత్వం జోక్యం లేకుండా ఉండాలి. క్యాంపస్ నుంచి పోలీస్ స్టేషన్‌ను ఎత్తేయాలి.
- హాస్టళ్ల భవనాలను ఆధునీకరించి, మౌలిక సదుపాయాలను కల్పించాలి. అవసరమైన కొత్త భవనాలను నిర్మించాలి.
- కబ్జాలకు గురైన యూనివర్సిటీ భూమిని తిరిగి పరిరక్షించి, వర్సిటీ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలి.
- విద్యార్థుల్లో స్కిల్ డెవలప్‌మెంట్ చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ఒక సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.
- పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
- మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను కూడా ఏర్పాటు చేయాలి.
- రీసెర్చ్ ఓరియంటేషన్‌లలో అన్ని లైబ్రరీలనూ ఆధునీకరించాలి.
- విద్యార్థి సంఘాలకు ఎన్నికలను వెంటనే నిర్వహించాలి.
- అన్ని సౌకర్యాలతో ఆస్పత్రిని ఆధునీకరించాలి.



