Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అకాడమిక్ విద్యతో పాటు ఒకేషనల్ కోర్సులు, సృజనాత్మకత అవసరం: కలెక్టర్

అకాడమిక్ విద్యతో పాటు ఒకేషనల్ కోర్సులు, సృజనాత్మకత అవసరం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
విద్యార్థులకు అకాడమిక్ విద్యుత్ తో పాటు, ఒకేషనల్ కోర్సులు, సృజనాత్మకత అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు ,9 ,10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకేషనల్ కోర్సులలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా ముందుగా వాటిపై అవగాహన కల్పించి అనంతరం సెట్విన్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక వృత్తులపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.    మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రాంనగర్ లో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో ఒకేషనల్ ట్రైనింగ్ పై విద్యార్థినిలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను చదువుతోపాటు, ఒకేషనల్ కోర్సులలో అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని, అంతేకాక వారికి క్రియేటివిటీ  కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇంజనీరింగ్, మెడిసిన్ లలో సైతం కొత్త టెక్నాలజీ అభివృద్ధి కావడం వల్ల అనేక మార్పులు చేసుకుంటున్నాయని ,భవిష్యత్తులో పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు ఇవి విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని, అందువల్ల వీటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ , కేజీబీవీ కళాశాలలు, పాఠశాలల్లో చదివే  ఇంటర్, 9, 10 తరగతుల విద్యార్థులకు బ్యాచులవారిగా సెట్విన్ ద్వారా ఓకేషనల్ శిక్షణ పై  వారి విద్యాసంస్థల్లోనే శిక్షణ ఇస్తామని తెలిపారు.   సెట్విన్ ద్వారా ఇచ్చే కోర్సులలో వెబ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిఫికేషన్, ఎడ్యుకేషనల్, టెక్నికల్ కోర్సులు ఎన్నో ఉన్నాయని తమ అభ్యర్థన మేరకు సెట్విన్ మొత్తం ఫీజులో సగం ఫీజు రాయితీగా  ఇవ్వనుందని, తక్కిన 50% ఫీజును కూడా  కట్టలేని నిరుపేద విద్యార్థులకు జిల్లా యంత్రంగా తరఫున ఫీజు చెల్లిస్తామని తెలిపారు.

సెట్విన్ ద్వారా వారంలో నాలుగు రోజులు ఓకేషనల్ కోర్సులపై శిక్షణ నిర్వహిస్తామని, కేవలం రెండు నెలల నుండి ఆరు నెలల వరకు మాత్రమే శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, పాఠశాల పూర్తయిన తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల ప్రతి విద్యార్థి ఏదో ఒక వృత్తి విద్యలో శిక్షణ పొందాలని కోరారు. విద్యార్థులు వారికి ఇష్టం ఉన్న కోర్సులను ఎంపిక చేసుకుని శిక్షణ పొందవచ్చని  అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ సెట్విన్ ద్వారా నిర్వహించే కోర్సులు, క్యారియర్  గైడెన్స్ పై అవగాహన కల్పించారు. 

విద్యార్థులు జీవితంలో మంచి స్థానాన్ని పొందేందుకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన కు కృషి చేయాలని, బాగా చదువుకోవాలని  చెప్పారు. ఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ఇటీవల దేశ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్    సాధించడాన్ని ఆమె గుర్తు చేయడమే కాకుండా, నిఖత్ జరీనా లాగ విద్యార్థినిలు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఏది సాధించాలన్న మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని, చిన్నచిన్న వృత్తులు, ఉద్యోగం ద్వారానే భవిష్యత్తులో సమాజంలో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు సాధించవచ్చు అని తెలిపారు. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలలో మొదటి రెండు స్థానాలలో నిలిచే ఇంటర్మీడియట్ తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు దేశంలో వారు కోరుకున్న చోటుకు విమాన ప్రయాణంతోపాటు రెండు రోజులు ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తామని అలాగే బాగా చదువు చెప్పిన టీచర్లకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని అందువల్ల బాగా చదవాలని కలెక్టర్ కోరారు.

  ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ,జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, డీఈఓ బిక్షపతి, తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్,సెట్విన్ ప్రతినిధి రేణుక, ప్రిన్సిపల్ కుబ్రా ,జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి,   తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -