Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయంయుద్ధంలో అంబానీ దందా

యుద్ధంలో అంబానీ దందా

- Advertisement -

ఇజ్రాయిల్‌పై భగ్గుమంటున్న ముస్లింలు
అమెరికా సాఫ్ట్‌ డ్రింక్‌కు పోటీగా క్యాంపాకోలా
యూఎస్‌ వ్యతిరేక ఉత్పత్తులకు ఆదరణ
క్యాష్‌ చేసుకుంటున్న అంబానీ కూల్‌డ్రింక్స్‌

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన కోకా-కోలా, పెప్సీ బ్రాండ్లు ప్రపంచ శీతల పానీయాల మార్కెట్లను శాసిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో కూడా వీటి హవాయే నడుస్తోంది. శీతల పానీయాల కంపెనీలు ఆర్జిస్తున్న మొత్తం ఆదాయంలో 90 శాతం ఆదాయాన్ని ఈ కంపెనీలే గడిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ కంపెనీలు అరుదైన సవాలును ఎదుర్కొంటున్నాయి. అదేమిటంటే ఈ కంపెనీల వినియోగదారులను ఓ స్థానిక బ్రాండ్‌ ఆకర్షిస్తోంది. గత రెండు సంవత్సరాల కాలంలో రిలయన్స్‌కు చెందిన కాంపా కోలా ఈ అమెరికా దిగ్గజ సంస్థల మార్కెట్‌ వాటాను కబళిస్తోంది. ఆగస్టులో రిలయన్స్‌ వార్షిక సమావేశం జరిగింది. అనేక రాష్ట్రాల్లో కాంపా కోలా రెండంకెల మార్కెట్‌ వాటాను సంపాదించిందని, మూడు దశాబ్దాల బహుళజాతి సంస్థల ఆధిపత్యానికి గండి కొట్టిందని ఆ సమావేశంలో రిలయన్స్‌ చెప్పింది.

ఇతర దేశాల్లోనూ…
ఈ బహిష్కరణ కేవలం భారత్‌కే పరిమితమై లేదు. మధ్యప్రాచ్యం నుంచి పశ్చిమ యూరప్‌ వరకూ అనేక మంది అమెరికా కోలాల వినియోగాన్ని ఆపేసి ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నారు. అయితే అమెరికా కోలాలను అధిక సంఖ్యలో బహిష్కరిస్తున్న ముస్లింల కారణంగా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నందుకు రిలయన్స్‌ గ్రూపులో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రూప్‌ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య సన్నిహిత సంబంధాలను వారు కారణంగా చూపుతున్నారు. అయితే ముస్లింలే కాదు…ట్రంప్‌ విధానాలు నచ్చని ఇతరులు కూడా పెద్ద సంఖ్యలో అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. కోకా-కోలా లేదా పెప్సీ అమ్మకాలు, కొనుగోళ్లను నిలిపేసిన వ్యాపారులు, వినియోగదారులను ‘స్క్రోల్‌’ పోర్టల్‌ పలకరించింది. ముస్లింల ప్రభావం అధికంగా ఉండే ఆగేయ ఢిల్లీలో కాకుండా దాని పరిసర ప్రాంతాల ప్రజల మనోగతాన్ని తెలుసుకుంది.

పుంజుకుంటున్న కాంపా వ్యాపారం
‘పాలస్తీనా ఆక్రమణతో సంబంధమున్న ఏ ఉత్పత్తినీ కొనుగోలు చేయం’ అని ఓ వెల్త్‌ మేనే జర్‌ చెప్పారు. గతంలో కోక్‌, పెప్సీ తాగేవాడినని, ఇప్పుడు వాటిని పూర్తిగా బహిష్క రించానని ఆయన తెలిపారు. గాజాలో ఇజ్రాయిల్‌ జరిపిన మారణహోమమే దీనికి కారణమని అన్నారు. కాగా కోకా-కోలా, అమెరికాకు చెందిన ఇతర ప్రముఖ బ్రాండ్లను బహిష్కరించాలని కోరుతూ గోడలపై కొందరు స్టిక్కర్లను అతికిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. గతంలో కోక్‌, పెప్సీ వంటి శీతల పానీయాలు విక్ర యించిన దుకాణదారులు ఇప్పు డు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని కాంపా పంపిణీ దారులుగా మారిపోతున్నారు. కాంపా అమ్మకాలు పెరుగుతుండడంతో వారి ఆదాయం కూడా పెరుగుతోంది. గడచిన ఆరేడు నెలల కాలంలోనే ఐదు కోట్ల రూపాయల వ్యాపారం చేశానని ఆజాద్‌ అనే పంపిణీదారు చెప్పారు. కొన్ని ఫుడ్‌ హబ్‌లు అయితే వినియోగదారులకు బిర్యానీ, కబాబ్స్‌తో పాటు కాంపాను మాత్రమే అందజేస్తున్నాయి.

ప్రభావం చూపని శాంతి ఒప్పందం
‘గాజాలో ఘర్షణ ప్రారంభమైన తర్వాత మా రెస్టారెంటుకు వినియోగదారు లెవ్వరూ రాలేదు. ఎందుకంటే కోకా-కోలా యాజమాన్యంలోని థమ్స్‌అప్‌ను మాత్రమే మేము అమ్మేవారం’ అని ఓ యువకుడు చెప్పారు. ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ కోకా-కోలా, పెప్సీ అమ్మకాలు పుంజుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. ఒకసారి ఓ ఉత్పత్తిని ప్రజలు బహిష్కరించిన తర్వాత వారి మనసు మార్చడం చాలా కష్టం. ‘నేను అమ్ముతున్న ప్రతి పది శీతల పానీయ సీసాల్లో ఎనిమిది కాంపావేనని ఓ వ్యాపారి తెలిపారు. ‘నా వద్దకు వచ్చే ముస్లిం వినియోగదారులు రుచి, ధర గురించి పట్టించుకోరు. ఇజ్రాయిల్‌కు సంబంధమున్న దేనినైనా వారు బహిష్కరిస్తారు’ అని ఆయన అన్నారు. కొల్‌కతా, లక్నో, హైదరాబాద్‌ వ్యాపారులు కూడా పెరుగుతున్న కాంపా అమ్మకాల గురించి చెబుతున్నారు.

అమెరికా బ్రాండ్ల బహిష్కరణ
కాంపా కోలా దెబ్బకు ఒక్క ఆగేయ ఢిల్లీ ప్రాంతంలోనే కోకా-కోలా 20 శాతం వ్యాపారాన్ని కోల్పోయిందని ఓ విక్రేత తెలిపాడు. ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న చోట కాంపా కోలా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు అది అత్యుత్తమ అమ్మకపు కోలాగా పేరు తెచ్చుకుంది. కాంపా విజయానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. గాజాలో సాగిన మారణకాండ కాంపా విజయానికి కొంత వరకూ కారణమని తెలుస్తోంది. ఇజ్రాయిల్‌తో స్నేహ సంబంధాలు నెరపుతున్న అమెరికాపై ముస్లింలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఇప్పుడు అమెరికా బ్రాండ్లను బహిష్కరించారు. వాటిలో కోకా-కోలా, పెప్సీ కూడా ఉన్నాయి.

కోకా-కోలా కలవరపాటు
టర్కీ, పాకిస్తాన్‌లో కోకా-కోలా మార్కెట్‌ వాటా నాలుగు నుంచి ఐదు శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ఈజిప్ట్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో స్థానిక ప్రత్యామ్నాయ పానీయాల అమ్మకాలు పెరిగాయని రాయిటర్స్‌ చెప్పింది. అమ్మకాలు క్షీణిస్తుండడంతో కలత చెందిన కోకా-కోలా కంపెనీ తన అధికారిక
వెబ్‌సైటులో వివరణ ఇచ్చుకుంది. తనది ఇజ్రాయిల్‌ కంపెనీ కాదని చెప్పుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -