Tuesday, January 13, 2026
E-PAPER
Homeబీజినెస్టీసీఎస్‌ లాభాలకు అమెరికా గండి..!

టీసీఎస్‌ లాభాలకు అమెరికా గండి..!

- Advertisement -

– క్యూ3 లాభాల్లో 14 శాతం పతనం
– నెమ్మదించిన ఆర్డర్లు
ముంబయి :
దేశంలోనే అతిపెద్ద ఐటి సేవల కంపనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) లాభాలకు అమెరికా విధాన చర్యలు గండి కొట్టాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో సంస్థ నికర లాభాలు 14 శాతం పతనంతో రూ.10,657 కోట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 63,973 కోట్లుగా ఉండగా.. క్యూ3లో 5 శాతం పెరిగి రూ.67,087 కోట్లుగా చోటు చేసుకుంది. అమెరికా, యూరప్‌ వంటి ప్రధాన మార్కెట్లలో అనిశ్చితి కొత్త ప్రాజెక్టుల రాక మందగించిందని సమాచారం. అమెరికా టారిఫ్‌లు, ఇతర విధానాలతో అంతర్జాతీయ అనిశ్చితి నెలకొనడం టీసీఎస్‌ ఫలితాలపై ప్రభావం చూపింది. అదే విధంగా సంస్థ నిర్వహణ మార్జిన్లపై ఒత్తిడి, క్లయింట్ల వ్యయం తగ్గింపు, వేతనాల పెంపు అంశాలు సంస్థ లాభాల తగ్గుదలకు కారణాలుగా ఉన్నాయి.

మధ్యంతర డివిడెండ్‌..
2025-26కు గాను మధ్యంతర డివిడెండ్‌ కింద ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.57 డివిడెండ్‌ను ప్రకటించింది. స్పెషల్‌ డివిడెండ్‌ కింద మరో రూ.46 కేటాయించింది. ఈ రెండు డివిడెండ్స్‌ కూడా ఫిబ్రవరి 3న చెల్లించనుంది. ఇందుకు జనవరి 17ను రికార్డ్‌ తేదిగా తీసుకుంది. ” 2025-26 రెండో త్రైమాసికంలో కనిపించిన వృద్ధి జోష్‌ మూడో త్రైమాసికంలోనూ కొనసాగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్‌ కంపెనీగా ఎదగాలనే మా లక్ష్యానికి మేము కట్టుబడి ఉన్నాము. మా ఎఐ సేవలు ఇప్పుడు వార్షిక ప్రాతిపదికన 1.8 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఎఐ పూర్తి విభాగాల్లో మేము చేస్తున్న పెట్టుబడుల ద్వారా క్లయింట్లకు అందిస్తున్న విలువకు ఇది నిదర్శనం” అని టీసీఎస్‌ సీఈఓ క్రితివాసన్‌ పేర్కొన్నారు. వినూత్నకల్పనల ద్వారా కస్టమర్లకు విలువైన ఎఐ అవకాశాలను గుర్తించడంలో సహాయపడటమే కాకుండా, ‘ర్యాపిడ్‌ బిల్డ్స్‌ ద్వారా పరిష్కారాలను వేగంగా అమలు చేశాము. కోస్టల్‌ క్లౌడ్‌ కొనుగోలుతో మా సేల్స్‌ఫోర్స్‌ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకున్నాము” అని ఆ కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆర్తి సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -