Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునియంతలా వ్యవహరిస్తున్న అమెరికా

నియంతలా వ్యవహరిస్తున్న అమెరికా

- Advertisement -

వెనిజులా అధ్యక్షుని అరెస్టుపై నోరు మెదపని ప్రధాని మోడీ
‘ఉపాధి’ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలే : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ- అచ్చంపేట
”అమెరికా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు నియంతలా, గూండాలా వ్యవహరిస్తోంది.. ఇతర దేశాలపై బెదిరింపులకు పాల్పడుతోంది.. వెనిజులా దేశంలో ఉన్న చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌.. డ్రగ్స్‌ పేరుతో ఆ దేశ అధ్యక్షున్ని అరెస్టు చేసి బంధించారు. ఈ విషయంపై వివిధ దేశాలు ఖండించాయి. భధ్రతా మండలిలో సైతం అనేక దేశాలు ట్రంప్‌ వైఖరిని తప్పు పట్టాయి. భారత ప్రధాని మోడీ మాత్రం నోరు మెదపడం లేదు.” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) నాగర్‌కర్నూల్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశం గురువారం అచ్చంపేటలో జరిగింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. వెనిజులా అధ్యక్షుని అరెస్టును సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోందన్నారు. డ్రగ్స్‌, మాదకద్రవ్యాల పేరుతో వెనిజులా అధ్యక్షులు మదురో, ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి అరెస్టు చేశారని.. కానీ ఈ దాడి వెనుక అసలు ఉద్దేశం ట్రంప్‌ ప్రకటనలతో బయటపడిందని అన్నారు.

వెనిజులాలోని చమురు నిల్వలపై పెత్తనం కోసమే అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ మదురోను అరెస్టు చేశారని తెలిపారు. బల ప్రయోగం ద్వారా ఒక దేశం మరో దేశ సార్వభౌమధికారాన్ని దెబ్బతీయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, తాము 60 శాతం నిధులు కేటాయిస్తాం.. 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని ప్రకటించడం చాలా దుర్మార్గమని అన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, కూలీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం పేరులో నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యుత్‌ వ్యవస్థను కూడా ప్రయివేట్‌పరం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఇది అమలు జరిగితే పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పూర్తి చేశామని పాలకులు చెబుతున్నారని.. ఆ పనులు ఎక్కడ జరిగాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై అసలు చర్చ జరగలేదని, ఎమ్మెల్యేలు పరస్పర విమర్శలు చేసుకోవడానికే సమయం సరిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీలైన వ్యవసాయ రైతులకు రూ.12,000, మహిళలకు రూ.2500, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం.. అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పరిసరాలలో డ్రగ్స్‌ పెద్ద మొత్తంలో బయట పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. డ్రగ్స్‌ వల్ల ప్రధానంగా యువత తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, ప్రజాసమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ధర్మానాయక్‌, ఆర్‌.శీను, ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దేశనాయక్‌, శంకర్‌ నాయక్‌, నాయకులు మల్లేష్‌, సైదులు, శివ వర్మ, నాగరాజు బాలస్వామి, రామయ్య దశరథం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -