బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం కాగానే తెరపైకి మస్క్ పొలిటికల్ ఎంట్రీ
ప్రజాభీష్టం మేరకే కొత్త పార్టీ అంటున్న టెస్లా అధినేత
అంత ఈజీకాదంటున్న రాజకీయ విశ్లేషకులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు, బిలీయనర్ అయిన ట్రంప్ ,మరో బిలీయనర్ ఎలన్ మస్క్ మధ్య నడిచిన మాటలు యుద్ధం కాస్త ఇపుడు రాజకీయం రూపంగా మలుచుకున్నది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ట్రంప్ సర్కార్ ఆమోదించగానే..మస్క్ ‘అమెరికా పార్టీ’ పేరిట నూతన రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేశారు. కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి అమెరికా ప్రజలకు అందించడమే తన పార్టీ లక్ష్యమని మస్క్ చెప్పారు. ‘ఇప్పుడు మనం ఏక పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో కాదు. మీ స్వేచ్ఛను తిరిగి మీకు అందజేసేందుకే ఈ రోజు అమెరికా పార్టీ ఆవిర్భవించింది’ అని స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత మస్క్ తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలిపారు. పార్టీ ఏర్పాటుకు సన్నాహకంగా… అమెరికా స్వాతంత్య్రదినోత్సవమైన శుక్రవారం నాడు ఆయన ఎక్స్‌లో ఓ పోల్ నిర్వహించారు. ‘రెండు పార్టీల (కొందరు ఒకే పార్టీ అంటారు) వ్యవస్థ నుంచి మీరు స్వేచ్ఛ కోరుకుంటున్నారా’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఈ సర్వేకు 12 లక్షల మంది అమెరికన్లు స్పందించారు. వీరిలో 65 శాతం మంది మస్క్ పార్టీకి జై కొట్టారు. ఈ నేపథ్యంలో.. ప్రజాభీష్టం మేరకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని శనివారం ఆయన ప్రకటించారు.
ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి
తన పోస్ట్‌కు మస్క్ రెండు తలల పామును జోడించి మీమ్‌ను ప్రద ర్శించారు. ‘ఏక పార్టీ పాలనకు స్వస్తి’ అని దాని కింద క్యాప్షన్ పెట్టారు. ఇదిలా వుండగా క్వాంటస్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో 40 శాతం మంది అమెరికన్లు కొత్త పార్టీపై సానుకూలత వ్యక్తం చేయడం విశేషం. మస్క్ పార్టీకి తప్పనిసరిగా మద్దతు ఇస్తామని 14 శాతం మంది, ఆ అవకాశం ఉన్నదని 26 శాతం మంది చెప్పారు. తాము మస్క్ పార్టీని సమర్ధించే అవకాశం ఉన్నదని రిపబ్లికన్లలో 57 శాతం మంది స్పష్టం చేయడం గమనార్హం. స్వతంత్రులలో 47 శాతం మంది మస్క్‌కు మద్దతు తెలిపారు. అయితే డెమొక్రాట్లలో మాత్రం మస్క్‌కు పెద్దగా మద్దతు లభించడం లేదు. కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఆయన పక్షాన నిలిచారు. రెండు పార్టీ ల పైన అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేయడం మరో ఆసక్తికరమైన పరిణామం. రిపబ్లికన్లు కానీ, డెమొక్రాట్లు కానీ అమెరికా విలువలకు ప్రాతినిధ్యం వహించరని 59శాతం మంది స్వతంత్రులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ గమ నించాల్సిన ముఖ్య విషయమేమంటే మరో రాజ కీయ పార్టీ అవసరం ఉన్నదని చెబుతున్న వారం దరూ మస్క్ వైపు లేరు. కానీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో వారు విసిగి వేసారిపోయారన్న వాస్తవాన్ని ఈ సర్వే ప్రతిబింబిస్తోంది.
పెరిగిన దూరం
ప్రభుత్వ వ్యయ బిల్లు విషయంలో ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీనిని ‘అత్యంత అద్భుతమైన బిల్లు’గా ట్రంప్ అభివర్ణిస్తే అమెరికా రుణభారాన్ని పెంచుతుందని, ఇప్పటికే ఉన్న అప్పులకు మరో 3.3 ట్రిలియన్ డాలర్లు జత కలుస్తాయని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు ఒకేలా వ్యవహరిస్తాయని, ప్రజా ప్రయో జనాలకు విరుద్ధంగా పనిచేస్తాయని విమర్శించారు. మస్క్ విమర్శలపై ట్రంప్ మండిపడ్డారు. మస్క్ కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తానని బెదిరిం చారు. మస్క్‌ను ఆయన స్వదేశమైన దక్షిణాఫ్రికాకు తిప్పి పంపుతానని కూడా హెచ్చరించారు. ట్రంప్ సన్నిహితుడైన స్టీవ్ బన్నన్ సైతం మస్క్‌ను విదేశీయుడని నిందించారు. కన్సర్వేటివ్ ఓటును చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్ 2024 ఎన్నికలలో ట్రంప్‌కు అత్యధికంగా విరాళాలు అందించారు. దీనికి ప్రతిఫలంగా ట్రంప్ ఆయనను డోగ్‌కు అధిపతిగా నియమించారు. అయితే భారీ వ్యయ ప్రణాళికలపై ట్రంప్‌తో మస్క్ విభేదించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ట్రంప్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయవద్దంటూ కాంగ్రెస్ సభ్యులకు మస్క్ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినప్పటికీ బిల్లుకు ఉభయసభల మద్దతు లభించడం, దానిపై ట్రంప్ సంతకం చేయడం కూడా జరిగిపోయింది. దీంతో ముందుగా ప్రకటించిన విధంగా మస్క్ కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. వచ్చే సంవత్సరం జరిగే మధ్యంతర ఎన్నికలలో మస్క్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియడం లేదు.
అంత ఈజీ కాదు
పార్టీ ఆవిర్భావం గురించి మస్క్ ప్రకటన అయితే చేశారు కానీ దానిని ఓ జాతీయ పార్టీగా తీర్చిదిద్దడం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే అమెరికాలో బ్యాలెట్‌లో చోటు దక్కించుకోవాలంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన ఉంటుంది. ఉదాహరణకు ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే 75.000 మంది నమోదైన సభ్యుల మద్దతు కానీ 11 లక్షల సంతకాలు కానీ అవసరమవుతాయి. చట్ట ప్రకారం మూడో పార్టీ ఏర్పాటు చాలా కష్టమని ఎన్నికల న్యాయవాది బ్రెట్ కప్పెల్ చెప్పారు.