ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికే దాడులు
భారత్ మౌనం సరికాదు : రైతు విద్యుత్ వ్యతిరేక బిల్లులు తెస్తున్న బీజేపీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
వ్యవసాయ రంగాన్ని మోడీ అమెరికాకు తాకట్టు : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి. వెంకట్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని ఆహ్వాన సంఘం ఏర్పాటు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఇరాన్‌పై యుద్ధం పేరుతో అమెరికా విధ్వంసం సృష్టిస్తోన్నదని, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికే ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడులు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఈ సమయంలో భారత్ మౌనంగా ఉండటం సరికాదన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘం కమిటీ ఏర్పాటు సందర్భంగా అంబేద్కర్ కళాభవన్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ. రాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ రైతు వ్యతిరేక బిల్లులు తెస్తూ బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఉపాధి కల్పించడానికి తీసుకొచ్చిన ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. అడవులను తెగనరికి కార్పొరేటు శక్తులకు అప్పచెప్పేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ శాస్త్రీయతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం ప్రజలను సమీకరించాలన్నారు. సంక్షేమ రంగాన్ని కాపాడుకోవడానికి పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరముందని తెలిపారు.
కమ్యూనిజమే ప్రత్యామ్నాయం
పెట్టుబడిదారి దేశాలు సంక్షోభంలో ఉన్న సమయంలో దానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమేనని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేవిధంగా మోడీ వ్యవహారం ఉందన్నారు. ప్రతి ఏటా రూ. 72 లక్షల కోట్ల ఆదాయం వచ్చే వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి కంపెనీ వ్యవసాయంగా మార్చి రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి రంగంలో మార్పులతో కార్మికులు తిరిగి వలసలు పోయే ప్రమాదం ఉందన్నారు. కుల, మత ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టి గద్దెనెక్కుతున్న బీజేపీని గద్దె దించేవరకు పోరాడాలన్నారు. వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ.సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, భూపాల్, రాష్ట్ర మహిళా కన్వీనర్ పద్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లె గోపాల్, ఎండి జబ్బార్, కార్యదర్శులు జీ. వెంకట్‌రాంరెడ్డి, వర్ధం పర్వతాలు, పుట్ట ఆంజనేయులు, వెంకటస్వామి, గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, కడియాల మోహన్, ఆర్.శ్రీనివాసులు, ఎస్,గోపీ, చంద్రకాంత్, రాజ్‌కుమార్, ప్రశాంత్, భరత్, హనుమంతు, కాంగ్రెస్ జిల్లా ఇంచార్జీ సంజీవ్ ముదిరాజ్, కౌన్సిలర్లు ఉమర్ కోత్వాల్, ప్రవీన్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ట్రంప్‌నకు యుద్ధ పిచ్చి ముదిరింది : సుశ్రుత ఆస్పత్రి ఎండీ డాక్టర్ మధుసూదన్ రెడ్డి
ట్రంప్‌నకు యుద్ధ పిచ్చి ముదిరిందని, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని సుశ్రుత ఆస్పత్రి ఎండీ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. వ్యకాస రాష్ట్ర మహాసభల సన్నాహక కమిటీ ఏర్పాటులో భాగంగా ఆయన మాట్లాడుతూ యుద్ధాలు జరిగితే ఎలాంటి వినాశనం జరుగుతుందో 175 ఏండ్ల క్రితం కమ్యూనిస్టు నిర్మాత కారల్ మార్క్స్ వివరించాడని గుర్తు చేశారు. యుద్ధాలను మనం పరిశీలిస్తుంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లినట్టు తెలుస్తోందన్నారు.
రష్యాలో బోల్సవికుల ద్వారా విప్లవం వచ్చి సోషలిస్ట్ సమాజం ఏర్పడడం చారిత్రాత్మకమన్నారు. మనదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడిందని గుర్తు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసిన ట్రంప్ నేడు ఇజ్రాయిల్‌ను ఇరాన్‌పై ఉసిగొలుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మత ప్రాంత విభేదాలను రెచ్చగొడుతూ మోడీ తన పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సన్మాహాక సమావేశాలను చూస్తుంటే కమ్యూనిస్టులకు మంచి రోజులు రానున్నాయని ఆయన తెలిపారు.
మహాసభల ఆహ్వాన సంఘం కమిటీ
మహాసభల ఆహ్వాన సంఘం కమిటీ చైర్మెన్‌గా డాక్డర్ మధుసుదన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా కెఎస్ రవికుమార్, చీప్ అడ్వయిజర్‌గా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నియమితులయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్‌రాములు, కోశాధికారి ఏ. రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ జబ్బార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిల్లె గోపాల్, పబ్లిసిటీ కార్యదర్శి కడియాల మోహన్‌ను నియమించారు.



