సిగాచి బాధితులకు సీఎం ఏం భరోసా ఇచ్చారు
ప్రభుత్వ సాయం చెప్పలేదు యాజమాన్యంపై హత్యానేరం కేసు పెట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
ఘటనా స్థలాన్ని సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
బాధితులకు ఓదార్పు.. క్షతగాత్రులకు పరామర్శ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
‘సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన యజమానుల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంది. బాధితుల్ని ఆదుకోవడంతో శ్రద్ధ చూపలేదు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించాలి. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై హత్యా నేరం కింద కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి. సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపి ప్రమాదానికి కారణమైన వాళ్లని కఠినంగా శిక్షించాలి’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు
. సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనా స్థలాన్ని సీపీఐ(ఎం) ప్రతినిధుల బృందంతో కలిసి జాన్‌వెస్లీ పర్యటించారు. ప్రమాదం జరిగిన స్థలం వద్ద శిథిలాల తొలగింపును పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఆచూకీ దొరకక రోధిస్తున్న వారితో మాట్లాడి ఓదార్చారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడి ప్రమాదం గురించి, సహాయక చర్యలు, మృతులు, గాయపడిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పటాన్‌చెరు ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించి అందుతున్న వైద్య సేవలు, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడారు.
పొట్టకూటి కోసం వలసొచ్చి పని చేస్తున్న కార్మికులు శవాలుగా మారుతుంటే యజమానులకే మద్దతు తెలిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తెస్తున్నాయన్నారు. సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో సుమారు 50 మంది మరణించిన ఘటనపై ప్రధాని మోడీ స్పందించిన తీరు సరిగ్గా లేదన్నారు. కార్మికులు చనిపోయేలా చట్టాలు చేస్తున్న మోడీ, మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. యజమానులకు అనుకూలంగా 12 గంటలు పని చేయాలనీ, కార్మికులకు ఏ హక్కులుండకూడదని చట్టాలు తెస్తున్నారని విమర్శించారు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఏం స్పందించారని, ఇక్కడ నష్టపోయిన బాధితులకు ఏం భరోసా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం ప్రకటించిన రూ. కోటి నష్టపరిహారం కంపెనీ నుంచి ఇప్పిస్తామని చెప్పడమేమిటని ప్రశ్నించారు. వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా వసూలు చేసి ఇస్తామని చెప్పడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఆ కోటి రూపాయల పరిహారం ఇచ్చే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదల్చుకున్నది, యాజమాన్యం ఏం చేయదల్చుకున్నదో స్పషంగా ప్రకటించాలన్నారు. సిగాచి యజమాన్యంపై వెంటనే హత్య కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ముడుపులు తీసుకుంటూ చేతులు ముడుచుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 200 మంది కార్మికులు కంపెనీలో పని చేస్తుంటే డెయిలీవేజ్ పని చేసే కార్మికుల పేర్లు రికార్డుల్లో ఎందుకు లేవన్నారు. 600 పరిశ్రమలున్న పాశమైలారంలో కనీసం మంటలార్పేందుకు ఫైర్ స్టేషన్ కూడా లేదన్నారు. సిగాచిలో మంటల్ని ఆర్పేందుకు నీళ్లులేక చుట్టుపక్కల వెతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
సరైన భద్రతా సౌకర్యాల్లేకే పెను ప్రమాదం: చుక్క రాములు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు
ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రెగ్యులర్‌గా తనిఖీలు చేయకపోవడం వల్లే సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. పరిశ్రమలో ప్రమాదం జరిగితే వెంటనే రావాల్సిన ఫైరింజన్లు ఇక్కడికి రావడానికి సరైన రోడ్లు లేవన్నారు. ఇరుకైన ప్రదేశంలో కెమికల్ పరిశ్రమలను పెట్టేందుకు ప్రభుత్వం ఎట్లా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూస్తున్నామన్నారు. కార్మికులు చనిపోవడానికి కారణమైన యాజమాన్యంపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. గుజరాత్‌కు చెందిన యజమాన్యం కార్మికుల్ని దోపిడీ చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తుందని అన్నారు. మృతులకు ప్రకటించిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. ఏపీలోని విశాఖపట్నంలో రెండు ప్రమాదాలు జరిగాయనీ, మరణించిన కార్మికులకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కోటి రూపాయలు చెల్లించగా చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ప్రమాదం లోనూ కోటి రూపాయల పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఇస్తామని అనకుండా, యాజమాన్యం నుంచి కోటి రూపాయలు వచ్చేట్టు చూస్తామని చెప్పడం సరికాదన్నారు. ఆ యజమాని ఎక్కడ ఉన్నాడు..? కంపెనీ ఎప్పుడు నడవాలి..? ఆ కోటి రూపాయలు బాధితులకు ఎప్పుడు అందుతాయని ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచే తక్షణం కోటి రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు బి.మల్లేశం, జి.సాయిలు, జిల్లా కోశాధికారి కె.రాజయ్య, నాయకులు అతిమేల మాణిక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కోట రమేష్, అవనగంటి వెంకటేశ్, పటాన్‌చెరు ఏరియా కార్యదర్శి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు వాజీద్ అలీ, కృష్ణ, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.