Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంఇండిగో విపత్తుపై సంస్థాగత విచారణ జరిపించాలి

ఇండిగో విపత్తుపై సంస్థాగత విచారణ జరిపించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌
న్యూఢిల్లీ :
విమాన ప్రయాణంలో సంభవించిన విపత్తుపై సంస్థాగత విచారణ నిర్వహించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశంలోని విమాన ప్రయాణీకులను పూర్తిగా విస్మరించడపై పొలిట్‌బ్యూరో ఈ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశీయ విమానరవాణా రంగంలో వాస్తవిక గుత్తాధిపత్యం/ఏకాధిపత్యం ఏర్పడ్డానికి సంబంధించిన నిర్మాణాత్మక అంశాల ఫలితంగానే పౌరవిమానయాన రంగంలో ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందని భావిస్తున్నట్టు పొలిట్‌బ్యూరో తెలిపింది. కోర్టు ఆదేశాల తరువాతే విమాన పైలట్ల, సిబ్బంది రక్షణను నిర్థారించడానికి, విమాన ప్రయాణీకుల భద్రతపై ఆందోళనలను పరిష్కరించడానికి ఉద్దేశించిన నూతన నిబంధనలను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రవేశపెట్టిందని, ఒకవైపు తగినంత సమయం ఉన్నప్పటికీ ఇండిగో తగిన సన్నాహాలు చేసుకోలేదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. తద్వారా ఇండిగో కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయని, గతంలో ఏన్నడూ లేని పరిస్థితి నేపథ్యంలో నిబంధనల అమలును వాయిదా వేయాలని డీజీసీఏ ను ఇండిగో బలవంతం చేయగలిగిందని, తద్వారా భద్రత విషయంలో తీవ్రంగా రాజీ పడ్డారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. మరోవైపు ఇండిగో విమానాల ఆకస్మిక రద్దుతో ఇతర విమానయాన సంస్థలు భారీ లాభాలను ఆర్జించడానికి పరిస్థితులు ఏర్పడ్డాయని, కనీసం వైద్య అత్యవసర పరిస్థితులకు కూడా విమాన ప్రయాణం అందకుండా పోయిందని పొలిట్‌బ్యూరో తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం గతకొన్నేళ్లుగా విమాన ప్రయాణ రంగంలో ఏర్పడిన నిర్మాణాత్మక లోపం యొక్క సహజ పరిణామమని, ఈ సంక్షోభం ఇలాంటి గుత్తాధిపత్యం/ఏకాధిపత్యం, ఆశ్రిత పక్షపాతం వంటి విమర్శలను వేగంగా, తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇతర మౌలిక సదుపాయాల రంగాలకు ముందస్తు హెచ్చరికను కూడా సూచిస్తుందని పొలిట్‌బ్యూరో తెలిపింది. యాదృచ్ఛింగా, ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి ఇండిగో భారీగా విరాళాలు ఇచ్చిందనే వార్తలు కూడా ఇదే సమయంలో వస్తున్నాయని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది. ఈ అసహ్యకరమైన పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ద్వారా సరైన స్వతంత్ర దర్యాప్తును తక్షణమే ప్రారంభించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. విమాన ఛార్జీలపై ధరల పరిమితిని ఎల్లప్పుడూ కచ్చితంగా పాటించేలా ప్రభుత్వం చూడాలని పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -