Thursday, July 3, 2025
E-PAPER
Homeజిల్లాలుసిగాచి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి: సీపీఐ(ఎం)

సిగాచి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

మృతులకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి.. 
మృతులకు మోడీ రూ.2 లక్షలు భిక్షం వేస్తున్నారా? 
ఎండీని తక్షణమే అరెస్టు చేయాలి..
కాలేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ చేయండి..
ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి..
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య..
నవతెలంగాణ – భువనగిరి
: సంగారెడ్డి జిల్లా పాశ మైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ విస్పోటం బాధాకరమని, పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. బుధవారం భువనగిరి సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ సమక్షంలో ఆయన మాట్లాడారు. ప్రమాదానికి కారణం యాజమాన్యాల లోపమేనని తెలిపారు.

మృతులలో అధిక భాగం ఒడిస్సా, బీహార్, చత్తీస్గడ్, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్ నుండి వచ్చిన వలస కార్మికులు ఉన్నారని తెలిపారు. వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. పొట్టకూటి కోసం వలసోచ్చి పనిచేస్తున్న కార్మికులు శవాలుగా మారుతుంటే యాజమాన్యాలకు మద్దతు తెలిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తేవడం బాధాకరమన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగడం మొదటిది కాదని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆందోళన చేయడం, కనుమరుగు కావడం జరుగుతుందన్నారు.

ఈ ఘటనలో 48 మృతదేహాలు బయటపడ్డాయని, మరో తొమ్మిది మంది ఆచూకీ లేదన్నారు. దీనిపై దేశ ప్రధాని మోడీ స్పందించడం సంతోషకరమన్నారు. మృతులకు రూ.2 లక్షలే ప్రకటించడం ముసలి కన్నీరే అవుతుందన్నారు. మృతులకు రూ.2 లక్షలు బిచ్చం వేస్తున్నారా అని ప్రశ్నించారు. సిగాచి ఘటనను మోడీ దృష్టికి తీసుకుపోయామని కిషన్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. దేశంలో మహిళలపై దాడులు, సామూహిక లైంగికదాడులు, హత్యలు జరుగుతుంటే నోరు విప్పని ప్రధాని మోడీ తెలంగాణలో రాజకీయ నాటకాల కోసం నోరు విప్పాడని ఎద్దేవా చేశారు. అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 కార్మికుల సంక్షేమం పని ప్రదేశాలలో వారి రక్షణ కోసం ఉద్దేశించి బడిందన్నారు.

అలాంటి చట్టం అమలు చేస్తే కార్మికులకు భద్రత హక్కులు కల్పించబడతాయన్నారు. దేశంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని, ఆ రద్దు చేసిన చట్టాలలో అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితులను పరిశీలించడం, ఒక్కొక్క మృతునికి రూ.1 కోటి ప్రకటించడం అభినందనీయమన్నారు. ఆ ఎక్సిగ్రేషియాను యాజమాన్యాలు చెల్లిస్తాయని తెలపడం హాస్యాస్పదమన్నారు. ఇంత పెద్ద ఎత్తున సంఘటన జరిగి వలస కార్మికులతో పాటు జనరల్ మేనేజర్ స్థాయి అధికారి మృతి చెందినా.. నేటికీ ఎండి సంఘటన స్థలానికి రాలేదన్నారు.

యాజమాన్యం తగిన రీతిలో స్పందించలేదన్నారు. ఇలాంటి యాజమాన్యాలు కార్మికులకు ఎక్స్ గ్రేషియా రూ.1 కోటి ఇస్తుందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రభుత్వమే మృతుల కుటుంబాలకు ఆ కోటి రూపాయల చొప్పున చెల్లించి యాజమాన్యం నుండి వసూలు చేసుకోవాలని సూచించారు.  తీవ్రమైన  గాయాలతో పని చేయలేని పరిస్థితిలో ఉన్న క్షతగాత్రులకు రూ. 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సమంజసంగా లేదన్నారు. కనీసం వారికి రూ. 50 లక్షలు  ప్రకటించాలన్నారు. 

కంపెనీలో తయారయ్యే వస్తువులు, పదార్థాలపై సాంకేతిక నిపుణులైన వారితో పనిచేయించాలన్నారు.  పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులతో పనిచేయడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారులు యాజమాన్యాలు కుమ్ముక్కు కావడంతోటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

కాళేశ్వరంపై విచారణ జరపాలి: ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ప్రతి రోజు ప్రస్తావించడం సరైనది కాదన్నారు.  ఒకే ప్రాజెక్టు మీద  రూ1.20 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం, అందులో అవినీతి జరగడం, అధిక మొత్తంలో బుగ్గిపాలు కావడం జరిగిందన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మధ్యతరగతి, చిన్న నీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి భూములను సస్యశ్యామలం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రాజెక్టు కింద భూములు తూర్పుగోదావరి జిల్లాలో ఉండే పచ్చదనం పంటలతో నిండిపోతాయన్నారు. మూసి పూర్తి విషపూరితమైన నీటీ ప్రవాహం అని పేర్కొన్నారు.

అ  నీరు వ్యవసాయానికి, త్రాగునీరుకు ఉపయోగపడదన్నారు. సుమారు రూ.360 కోట్లతో బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేస్తే, మూసి నీరు లేకుండానే వ్యవసాయం ఈ ప్రాంతంలో చేయవచ్చన్నారు. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ పనులు చేపట్టాలన్నారు. గోదావరి, కృష్ణా జలాలను మూసిలోకి తరలించాలన్నారు. మూసి ప్రవహించే కాలువల వద్ద నీటి శుద్ధి ప్లాంట్లను అత్యాధునిక సాంకేతికంతో నిర్మించాలన్నారు. చిన్న నీటి ప్రాజెక్టులను పట్టించుకోవాలన్నారు. మూసి ప్రక్షాళన చేసిన తర్వాత, పరివాహక ప్రాంతాల వారికి నష్టం చేకూర్చకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే, తమకు ప్రజలకు అభ్యంతరం లేదన్నారు. మూసి ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ యాజమాన్యాలకు, కార్పొరేట్ శక్తుల పోట్టలు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ప్రజలకు, రైతులకు ఉపయోగపడకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే, ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. బనకచర్ల నీటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి, వాటాలు పంచుకోవాలన్నారు. నేటికీ తెలంగాణ ప్రభుత్వం నికరజలాలను వాడుకోలేకపోతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా ఏకపక్షంగా పోతే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -