త్రిపురలో దుకాణాలు, ఇండ్లు, ప్రార్థనా స్థలానికి నిప్పు
పోలీసుల ప్రేక్షకపాత్ర : బాధితులు
ఇంటర్నెట్ సేవలు బంద్
అగర్తలా : స్థానిక ఆలయం కోసం నిధుల సేకరణకు సహకరించటంలేదని హిందూత్వశక్తులు అరాచకం సృష్టించారు. త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఓ వర్గానికి చెందిన పలు దుకాణాలు, ఇండ్లు, ప్రార్థన స్థలానికి నిప్పుపెట్టారు.
కుమార్‌ఘాట్ సబ్-డివిజన్‌లోని సైదర్‌పర్‌లో జరిగిన ఈ దాడిలో పోలీసు సిబ్బందితో సహా కనీసం పది మంది గాయపడ్డారని ఒక పోలీసు అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. సున్నితమైన ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు పాదరక్ష గస్తీ నిర్వహిస్తున్నాయని, కొత్తగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవినాష్ కుమార్ రారు తెలిపారు.”హింసతో సంబంధం ఉన్నారనే ఆరోపణలపై పది మందిని అరెస్టు చేశాం” అని ఆయన అన్నారు. ”హిందుత్వ కార్యకర్తల” బందం ఒక నివాసికి చెందిన దుకాణానికి వచ్చి స్థానిక ఆలయం కోసం విరాళాలు (చందా) అడిగినప్పుడు ఈ సంఘటన జరిగింది. తాను ఇప్పటికే కొంత మొత్తం ఇచ్చానని, మరికొన్ని రోజుల్లో మరికొంత ఇస్తానని ఆ బృందానికి షాపు యజమాని చెప్పారు.”కానీ వారు వినకుండా.. ఈ క్షణమే డబ్బు కావాలని పట్టుబట్టారు… అప్పుడు వారు నన్ను కొట్టడం ప్రారంభించారు… దాడి తర్వాత, నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు నా ఇంటికి వెళ్లి దానికి నిప్పంటించారు,” అని బాధితుడు వాపోయారు. ఆ ప్రాంతానికి చెందిన మరో నివాసిపై కూడా ఆ బృందం దౌర్జన్యానికి పాల్పడిందని తెలిపారు.”వారు మమ్మల్ని కొట్టడంతో ఆగలేదు… వారు ఐదు లేదా ఆరు ఇండ్లకు నిప్పంటించారు, ఓ వర్గానికి చెందిన దుకాణాలను తగలబెట్టారు. సైదూర్ పారా ప్రాంతంలోని ప్రార్థనాస్థలాన్ని తగలబెట్టారు. బైక్‌లు, కార్లు, చివరికి ఒక ట్రాక్టర్ కూడా ధ్వంసమయ్యాయి,” అని ఆయన ఆరోపించారు. అయితే సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారులు జోక్యం చేసుకోలేదని కూడా అన్నారు. దాడి జరిగిన సమయంలో పోలీసు సిబ్బంది అక్కడే ఉన్నారని, అయితే వారు జోక్యం చేసుకోలేదని కూడా ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా, హింస ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించకుండా తనను అడ్డుకున్నారని కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు బిరాజిత్ సిన్హా తెలిపారు. ”నిన్నటి ఘర్షణల తర్వాత సైదర్‌పర్‌లో బాధితులైన గ్రామస్తులను కలవడానికి మేము వెళ్లాం, కానీ భద్రతా కారణాలు చూపి పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని ఆయన విలేకరులతో అన్నారు.
ప్రతిపక్ష నాయకుడు జితేంద్ర చౌదరి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, మైనారిటీ వర్గానికి చెందిన ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ”కుమార్‌ఘాట్ తగలబడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి ఉత్తర త్రిపురలోని కంచన్‌పూర్‌లో రోడ్‌షో నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. మత హింసపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు,” అని ఆయన అన్నారు. పోలీసుల ప్రకారం, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు ఆ ప్రాంతంలో అమలులో ఉన్నాయి . ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఆలయ నిర్మాణానికి నిధులివ్వలేదని అరాచకం
- Advertisement -
- Advertisement -



