Tuesday, December 9, 2025
E-PAPER
Homeఆటలుఇక ధనాధన్‌

ఇక ధనాధన్‌

- Advertisement -

– భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టీ20 నేడు
– శుభ్‌మన్‌ గిల్‌ రాకతో ఉత్సాహం
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత.. భారత్‌ ఈ ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించగా, దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనతో ప్రాధాన్యత కోల్పోయింది. జొహనెస్‌బర్గ్‌ థ్రిల్లర్‌ అనంతరం భారత్‌ 30 మ్యాచుల్లో 26 విజయాలు సాధించగా.. సఫారీలు 25 మ్యాచ్‌ల్లో 16 పరాజయాలు చవిచూశారు. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైన తరుణంలో మరోసారి భారత్‌, దక్షిణాఫ్రికా పొట్టి ఫార్మాట్‌లో తలపడుతున్నాయి. కటక్‌లో నేడు తొలి టీ20 పోరు.

నవతెలంగాణ-కటక్‌

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా ముచ్చటగా మూడో సిరీస్‌ సవాల్‌కు సిద్ధమైంది. టెస్టుల్లో దక్షిణాఫ్రికా చారిత్రక విజయం సాధించగా.. వన్డేల్లో భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. నేడు కటక్‌ టీ20తో ఇరు జట్ల ఫోకస్‌ పొట్టి ఫార్మాట్‌పై పడింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ విజయంతో టూర్‌ను విజయవంతంగా ముగించాలని సఫారీలు ఎదురుచూస్తుండగా.. సొంతగడ్డపై మెగా ఈవెంట్‌ ముంగిట ప్రత్యర్థిని చిత్తు చేయాలనే పట్టుదల టీమ్‌ ఇండియాలో కనిపిస్తోంది. భారత జట్టు ఎంపిక, తుది జట్టు కూర్పుపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతుండటంతో.. సఫారీతో సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శన కీలకం కానుంది.

గిల్‌ వస్తున్నాడు
ఈడెన్‌గార్డెన్స్‌ టెస్టులో మెడ నొప్పితో టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. మెడ నొప్పి నుంచి కోలుకున్న గిల్‌ నేడు కటక్‌లో అభిషేక్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడనున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మలు మిడిల్‌ ఆర్డర్‌లో ఆడనుండగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సైతం తిరిగి జట్టులోకి రానున్నాడు. హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ పేస్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా జట్టులో ఉండనున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌ విభాగంలో.. జశ్‌ప్రీత్‌ బుమ్రా పేస్‌ బాధ్యతలు చూసుకోనుండగా.. మరో స్పెషలిస్ట్‌ పేసర్‌, పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఎవరిని తీసుకోవాలనే మీమాంశ జట్టు మేనేజ్‌మెంట్‌లో కనిపిస్తోంది. సంజు శాంసన్‌ ఓపెనర్‌గా శతకాలు బాదినా.. మిడిల్‌ ఆర్డర్‌లో మళ్లీ సత్తా చాటాల్సి రావటంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో తుది జట్టు కూర్పుపై అభిమానుల్లో, విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది.

బలహీనంగా సఫారీ?
ఈ ఫార్మాట్‌లో సఫారీలు బలహీనంగా కనిపిస్తున్నారు. జట్టులో చోటు, బాధ్యతలపై స్పష్టత లేకపోవటం సహా విధ్వంసక బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ వీడ్కోలు తీసుకోవటం దక్షిణాఫ్రికాపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. క్వింటన్‌ డికాక్‌, మార్‌క్రామ్‌, హెండ్రిక్స్‌, డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ నిలకడగా రాణించటం లేదు. టీ20ల్లో జట్టుగా రాణించటంతో సఫారీ ఇటీవల విఫలం అవుతోంది. ఈ సిరీస్‌లో ఆ లోపాలను సఫారీలు దిద్దుకుంటారా? అదే బాటలో నడుస్తారా? చూడాలి.

పిచ్‌, వాతావరణం
కటక్‌లో దక్షిణాఫ్రికాకు మంచి రికార్డుంది. ఇక్కడ జరిగిన మూడు టీ20ల్లో రెండింట సఫారీలు ఆడారు. ఆ రెండు మ్యాచుల్లోనూ దక్షిణాఫ్రికాదే విజయం. కటక్‌ పిచ్‌ బ్యాటర్లకు, బౌలర్లకు సమంగా అనుకూలిస్తుంది. ఆరంభంలో సీమర్లకు కాస్త సహకారం లభించినా.. ఆ తర్వాత స్పిన్నర్లకు టర్న్‌ ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం గణనీయంగా కనిపిస్తుంది. మంగళవారం మేఘావృత వాతావరణం నెలకొన్నా.. మ్యాచ్‌ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోనుంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, శివం దూబె, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కార్బిన్‌ బాచ్‌, మార్కో యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, లుంగి ఎంగిడి, ఎన్రిచ్‌ నొకియా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -