Monday, July 28, 2025
E-PAPER
Homeజాతీయంఅనిల్‌ అంబానీది కార్పొరేట్‌ దోపిడీయే !

అనిల్‌ అంబానీది కార్పొరేట్‌ దోపిడీయే !

- Advertisement -

పారు బకాయిలుగా మారిన వేల కోట్ల రుణాలు
తొలుత మోసం అంటూ ఆ తర్వాత మాటమార్చిన ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌
ప్రభుత్వ మౌనంపైనా అనుమానాలు
విస్త్రృత విచారణ జరపాలంటున్న బ్యాంకింగ్‌ రంగ నిపుణులు
న్యూఢిల్లీ :
వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ రుణాలకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన కథనాలను గమనిస్తే మన బ్యాంకింగ్‌, న్యాయ వ్యవస్థలో ప్రశ్నార్థకమైన ఆర్థిక లావాదేవీలు, నియంత్రణ లోపాలు, వ్యవస్థాగత వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కన్పిస్తాయి. అనిల్‌ అంబానీ యాజమాన్యంలోని వివిధ కంపెనీలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి రూ.48,216 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. బ్యాంకుల చేతకానితనం, అలసత్వంతో ఇప్పుడవి పారు బకాయిలు (ఎన్‌పీఏ)గా మారిపోయాయి. అనిల్‌ కంపెనీలను తొలుత మోసపూరిత సంస్థలుగా గుర్తించిన ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌ ఆ తర్వాత మాట మార్చడం వెనుక ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది. అలాగే అనిల్‌ కంపెనీలు దేశ విదేశీ బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే కేంద్ర పెద్దలు ఎందుకు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారో, దాని వెనుక ఉన్న మతలబు ఏమిటో కూడా తెలియాల్సి ఉంది.

మాట మార్చిన కెనరా బ్యాంక్‌
దివాలా తీసినట్టు ప్రకటించినప్పటికీ దస్సాల్ట్‌ రిలయన్స్‌, ఏరోస్పేస్‌ వంటి బడా వ్యాపార దిగ్గజాలతో అంబానీ తన సంబంధాలను కొనసాగించారు. అంబానీ వ్యవహారాలపై లోతుగా విచారణ జరపాలంటూ భారతీయ బ్యాంక్‌ ఉద్యోగుల సమాఖ్య (బెఫీ) అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ అనిల్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. గత నెల 30న ఎస్‌బీఐ నుంచి అనిల్‌ అంబానీకి నోటీసు అందింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ కామ్‌) ఖాతా మోసపూరితమైనదని అందులో ఎస్‌బీఐ తెలిపింది. కంపెనీతో పాటు దాని మాజీ డైరెక్టర్‌ అనిల్‌ అంబానీ పేరును రిజర్వ్‌బ్యాంక్‌కు పంపానని పేర్కొంది. దీనికి అనిల్‌ తన న్యాయవాది ద్వారా సమాధానం పంపారు. తన వాదనను వినిపించేందుకు ఎస్‌బీఐ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన అందులో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ గత నవంబరులో ఆర్‌ కామ్‌ ఖాతాను మోసపూరితమైనదిగా గుర్తించింది. ఎస్‌బీఐ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత కేవలం 18 రోజుల వ్యవధిలోనే కెనరా బ్యాంక్‌ మాట మార్చింది. గతంలో అంబానీ కంపెనీపై వేసిన మోసపూరిత సంస్థ ట్యాగ్‌ను తొలగించినట్లు కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.

రుణ సంతర్పణ చేసిన బ్యాంకులివే
అనిల్‌ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ కామ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థలు 2015లో ఎస్‌బీఐతో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి
అనిల్‌ అంబానీది కార్పొరేట్‌ దోపిడీయే !
రుణాలు తీసుకున్నాయి. రుణాల పంపకం 2016లోనే పూర్తయింది. ఎస్‌బీఐ అత్యధికంగా రూ.3,628.68 కోట్ల రుణం ఇచ్చింది. రూ.1,832.91 కోట్లతో ఇండిస్టియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా రెండో స్థానంలో నిలిచింది. అంబానీకి రుణ సంతర్పణ చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, శుభా హోల్డింగ్స్‌, ఎస్‌సీ లోవి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, దోహ బ్యాంక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌, ఎమిరేట్స్‌ బ్యాంక్‌, చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా మొదలైనవి ఉన్నాయి. అంబానీ ఈ సంస్థల్ని మోసం చేసి రూ.48,216 కోట్ల విలువైన ప్రజల డిపాజిట్లను దోచుకున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు 2020లో పారు బకాయిలుగా ప్రకటించాయి. అంబానీ ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన ఎస్‌బీఐ 2020 నవంబర్‌ 10న తన రికార్డులలో ఆయన కంపెనీని మోసపూరిత సంస్థగా ముద్ర వేసింది.

అనిల్‌ మొసలి కన్నీరు
మోసపూరిత సంస్థ ముద్ర నుంచి తొలగించిన తర్వాత రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ను దివాలా కింద వేలానికి పెట్టారు. అనిల్‌ సోదరుడైన ముకేష్‌ యాజమాన్యంలోని జియో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ వేలంలో దానిని కొనుగోలు చేసింది. కానీ తాము ఇచ్చిన రుణాల కింద బ్యాంకులు పొందింది నామమాత్రపు మొత్తమే. అనిల్‌ కంపెనీలు మూడు చైనా బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందాయి. రుణాలు ఎన్‌పీఏగా మారడంతో అవి బ్రిటన్‌ కోర్టులో రికవరీ కోసం కేసులు పెట్టాయి. అనిల్‌ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చుతూ చైనా బ్యాంకులకు రూ.5,448 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. మన దేశీయ బ్యాంకులు మాత్రం రుణాలను ఎన్‌పీఏగా ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. బ్రిటన్‌ కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన అనిల్‌ మొసలి కన్నీరు కార్చారు. తాను పూర్తిగా దివాలా తీశానని, తన ఖర్చులను భార్య, ఇతర కుటుంబ సభ్యులే భరిస్తున్నారని, కుమారుడు అన్మోల్‌ అంబానీ నుంచి కోట్లాది రూపాయల అప్పు తీసుకున్నానని చెప్పారు. చట్టపరమైన ఖర్చుల కోసం తన వద్ద ఉన్న ఆభరణాలన్నింటినీ రూ.తొమ్మిది కోట్లకు అమ్మేశానని, ఇక తన వద్ద విలువైనవేవీ లేవని తెలిపారు.

ఈ ప్రశ్నలకు జవాబులేవి?
ఈ కేసు అనేక నాటకీయ మలుపులు తిరిగిన తర్వాత 2020 అక్టోబర్‌ 12న ఢిల్లీ హైకోర్ట్‌ చైనా బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. భారత్‌లో తాను వేసిన కేసు విచారణ సందర్భంగా చైనా కంపెనీల వాదనలూ వినాలని అనిల్‌ కోర్టును అభ్యర్థించడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. లండన్‌ కోర్టులో చైనా బ్యాంకులు దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా అనిల్‌ అంబానీ వినిపించిన వాదనలను పరిశీలిస్తే ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆయన కంపెనీని మోసపూరిత సంస్థ ట్యాగ్‌ నుంచి తొలగించాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2020లో అనిల్‌ కంపెనీలను మోసపూరిత సంస్థల జాబితా నుంచి ఎందుకు తొలగించారు? దానిని కొత్త యజమాని అయిన అనిల్‌ సోదరుడికి ఎందుకు అప్పగించారు? ఇప్పుడు మళ్లీ అనిల్‌ను నిజాయితీ లేని వ్యక్తిగా ఎందుకు చూస్తున్నారు? వివిధ బ్యాంకుల నుంచి పొందిన రుణాన్ని అనిల్‌ దుర్వినియోగం చేశారని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు గుర్తించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉంది.

డస్సాల్ట్‌ ఒప్పందంలోనే వివాదం
అనిల్‌ అంబానీ స్థాపించిన రిలయన్స్‌ ఏరోస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఏఎల్‌), ఫ్రాన్స్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న డస్సాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని నాగపూర్‌లో జెట్‌ విమానాల పాల్కన్‌ సిరీస్‌ ఉత్పత్తిని ప్రారంభించాయి. దీనికి ఏయే బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలు సమకూర్చిందీ ఇంకా తెలియలేదు. 2015లో మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించినప్పుడు డస్సాల్ట్‌ నుంచి రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో రిలయన్స్‌ ఏరోస్పేస్‌ను భారత భాగస్వామిగా చేయాలని చేసిన ప్రయత్నాలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
భారతీయ బ్యాంకులను కోట్లాది రూపాయల మేర దోచుకొని విదేశాలకు పలాయనం చిత్తగించిన విజరు మాల్యా, లలిత్‌ మోడీలు ఓ విలాసవంతమైన వేడుకలో పాల్గొని సంబరాలు చేసుకున్న దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. ఆ వేడుకలో అమెరికా గాయకుడు ఫ్రాంక్‌ సినాత్రా ఓ పాట పాడారు…’ఇప్పుడు ముగింపు దగ్గర పడింది’ అనే పదాలు ఆ పాటలో విన్పిస్తాయి. మరి ఆ ముగింపు ఎవరికి వర్తిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

ఆర్‌బీఐ ఏం చెబుతోంది?
రుణాలను దుర్వినియోగం చేయడం, నేరపూరిత నమ్మక ద్రోహం, నకిలీ ఆర్థిక సాధనాలను ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడడం, ఖాతా పుస్తకాలను తారుమారు చేసి మోసానికి పాల్పడడం, అక్రమంగా రుణాలు పొందడం, కృత్రిమ ద్రవ్య సంక్షోభాన్ని చూపడం, రికార్డులను మసిబూసి మారేడుకాయ చేయడం, విదేశీ కరెన్సీతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం…ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడితే మోసపూరిత సంస్థగా గుర్తిస్తారు. అంటే అనిల్‌ అంబానీ కంపెనీలు ఈ చర్యలకు పాల్పడినట్లేనని స్పష్టమవుతోంది. అయితే ఎస్‌బీఐ కూడా కెనరా బ్యాంక్‌ మాదిరిగానే అనిల్‌ కంపెనీలను మోసపూరిత సంస్థల జాబితా నుండి తొలగించింది. మోసపూరిత ఖాతాపై సెంట్రల్‌ రెస్పిరేటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్స్‌ (సీఆర్‌ఐఎల్‌సీ)కి తెలియజేయాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -