– ఆయన గ్రూపునకు చెందిన కంపెనీలపై దాడులు
– ముంబయి, ఢిల్లీ నగరాల్లో 35కి పైగా చోట్ల సోదాలు
– రూ.3000 కోట్ల రుణాలు క్లియర్ చేసేందుకు బ్యాంకు ఉన్నతాధికారులకు అనిల్ అంబానీ లంచాలు?
న్యూఢిల్లీ : వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని షాకిచ్చింది. అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలపై దర్యాప్తు సంస్థ దాడులు జరిపింది. ముంబయి, ఢిల్లీ నగరాల్లో 35కి పైగా చోట్ల, 50 కంపెనీలు, 25 కంటే ఎక్కువ మందిపై ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) లోన్ ఖాతాలను ఫ్రాడ్‌గా తేల్చిన విషయం విదితమే. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈడీ ఈ చర్యలకు దిగటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రస్తుత ఈ సోదాలు మనీలాండరింగ్‌కు సంబంధించినవిగా తెలుస్తున్నది.సీబీఐ నమోదు చేసిన రెండు ప్రాథమిక సమాచార నివేదికల ఆధారంగా ఈడీ దర్యాప్తు సాగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై దర్యాప్తు సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తున్నది. అనిల్ అంబానీ చేసిన మోసాలపై ది నేషనల్ హౌజింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర ఏజెన్సీలు, సంస్థలు ఈడీతో సమాచారాన్ని పంచుకున్నాయని ఏజెన్సీ వర్గాలు చెప్పాయి. ”బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ఇతర ప్రభుత్వ సంస్థలను మోసం చేయటం ద్వారా ప్రజా ధనాన్ని మళ్లించటానికి, దోచుకోవటానికి చాలా ప్రణాళికబద్ధంగా పథకం వేసినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎస్ బ్యాంక్స్ లిమిటెడ్ ప్రమోటర్స్‌తో సహా బ్యాంకు అధికారులకు లంచం ఇచ్చిన ఆరోపణల పైనా దర్యాప్తు జరుగుతుంది” అని వివరించాయి. విస్తృత దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూపుతో సంబంధం ఉన్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా విచారించినట్టు తెలుస్తున్నది.
అనిల్ అంబానీకి రుణం.. పలు ఉల్లంఘనలు
2017-2019 మధ్య ఎస్ బ్యాంకు నుంచి సుమారు రూ.3000 కోట్ల అక్రమ రుణ మళ్లింపు జరిగిందని ఆరోపణలున్నాయి. అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలకు రుణాలు మంజూరు చేయటానికి ముందు.. ఎస్ బ్యాంకు ప్రమోటర్లకు, వారితో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ కనుగొన్నది. ఈ విషయంలో లంచాలు, రుణం సంబంధాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోందని ఏజెన్సీ వర్గాలు చెప్పాయి. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలకు ఎస్ బ్యాంకు లోన్ అప్రూవల్స్‌లో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినట్టు ఈడీ కనుగొన్నది. ఇందులో పాత క్రెడిట్ అప్రూవల్ మెమోరాండమ్స్ (సీఏఎంలు),బ్యాంకుల క్రెడిట్ పాలసీని ఉల్లంఘించి ఎలాంటి క్రెడిట్ విశ్లేషణ లేకుండా పెట్టుబడులను ప్రతిపాదించటం వంటివి ఈడీ కనుగొన్నది. రుణ నిబంధనలలో ఉల్లంఘన జరిగి.. ఈ లోన్లు అనేక గ్రూపు కంపెనీలు, షెల్ కంపెనీలకు మళ్లించబడ్డాయని ఈడీ గుర్తించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న రిలయన్స్ హౌమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) కార్పొరేట్ రుణ వితరణ.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగిందనీ, ఇది ఈడీ పరిశీలనలో ఉన్నదని ఏజెన్సీ వర్గాలు వివరించాయి.
అనిల్ అంబానీకి ఈడీ షాక్
- Advertisement -
- Advertisement -