నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
అనంత ఈ-సొల్యూషన్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు మరో నిందితురాలు మంజులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దాదాపు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి వారి నుంచి రూ.50లక్షలకు పైగా నిందితులు వసూలు చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు పేర్కొన్నారు. పట్టణంలోని తిలక్ నగర్ కు చెందిన బాధితుడు మెస్రం ఉమేష్ జులైలో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లోనే బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కోవ విఠల్ ను నిందితునిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.
తాజాగా మరో నిందితురాలు మంజుల (జనగాం జిల్లా)ను బుధవారం అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు మధుకిరణ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఎవరూ ఇలా ఉద్యోగాల వంకతో డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సైతం ప్రకటనలు వెలువడుతాయని, దరఖాస్తులు చేసుకొని పరీక్షలు రాశాక ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు వరిస్తాయన్నారు. ఉద్యోగాల వంకతో మోస పోయిన వారుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.



