Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమరో కులదురహంకార హత్య

మరో కులదురహంకార హత్య

- Advertisement -

దళిత యువకుడి ప్రేమ పెండ్లి
ఆయన అన్నను కిడ్నాప్‌ చేసి చంపేసిన అమ్మాయి కుటుంబీకులు
హంతకులను కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్‌
షాద్‌నగర్‌లో ఆందోళన, రాస్తారోకో

నవతెలంగాణ-షాద్‌నగర్‌రూరల్‌, షాద్‌నగర్‌
రాష్ట్రంలో కులదురహంకారం పేట్రేగిపోతోంది. తమ కూతురిని ప్రేమ పెండ్లి చేసుకున్నాడనే కారణంతో అబ్బాయి కుటుంబంపై కక్ష కట్టిన అమ్మాయి కుటుంబీకులు వరుడి అన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూక్‌ నగర్‌ మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు చంద్రశేఖర్‌(ఎస్సీ), అదే గ్రామానికి కావలి వెంకటేష్‌ కూతురు భవాని(బీసీ) ప్రేమించుకున్నారు. వీరి విషయం ఇంట్లో తెలియడంలో అమ్మాయి తరపు వాళ్లు పెండ్లికి ఒప్పుకోలేదు. దాంతో వీరు హైదరా బాద్‌లో రహస్యంగా కులాంతర వివాహం చేసుకున్నారు.

ఈ విషయం యువతీ కుటుంబ సభ్యులకు తెలియడంతో దళిత యువకుడి కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. చంద్రశేఖర్‌ సోదరుడైన రాజశేఖర్‌ (35)ను టార్గెట్‌ చేశారు. ఆయనతో మాట్లాడాలని బుధవారం యువతి తండ్రి కావలి వెంకటేష్‌ పిలిపించారు. అనంతరం మరికొందరితో కలిసి సినీఫక్కిలో రాజశేఖర్‌ను కిడ్నాప్‌ చేసి మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబుపేట్‌ మండలానికి తరలించారు. అక్కడ రాజశేఖర్‌ను క్రూరంగా హింసించి, పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఆ రాత్రి రాజశేఖర్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధ రాత్రి కాలి న మృతదేహాన్ని నవాబుపేట అడవుల్లో పోలీసులు గుర్తించి రాజశేఖర్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు రాజశేఖర్‌ మృతదేహంగా గుర్తించారు. ఈ హత్యతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి :కేవీపీఎస్‌
దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నా డని అతని సోదరుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన కావలి వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్‌బాబు, కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి వహీద్‌ డిమాండ్‌ చేశారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌ నియోజక వర్గ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. అనంతరం షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు 142 జరిగాయని తెలిపారు.

పోలీసుల నిర్లక్ష్యంతోనే వరుస ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ బాధిత కుటుంబాన్ని పరామర్శించా లన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాజశేఖర్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఆలిండియా సమతా పార్టీ అధ్యక్షులు దానక్క సంగమేశ్వర్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎం.ప్రకాష్‌ కారత్‌, కుల నిర్మూలన సంఘం ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి చింతపల్లి ప్రభాకర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.రాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనునాయక్‌, తెలంగాణ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -