నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విలన్ గ్యాంగ్‌లో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు పొందిన నటుడు బోరబండ భాను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన అనేక చిత్రాల్లో ప్రతినాయకుడి బృందంలో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఓ మిత్రుడి ఆహ్వానంతో భాను గండికోట వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి సంతోషంగా పార్టీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బొత్కూర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే భాను మృతి చెందారు. ఘటనకి ముందు కొన్ని గంటలకే, భాను “గండిపేట వచ్చా… ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా” అంటూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. భాను ఆకస్మిక మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ప్రత్యేకించి విలన్ పాత్రల్లో కనిపించే పలువురు నటులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. ‘‘భాను ఎంత నవ్వుతూ ఉండేవాడో… అంతే హాస్యం ప్రేమించేవాడు… ఈ వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టం’’ అని ఆయన సహచర నటులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు.
నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించినప్పటికీ, నిజ జీవితంలో భాను ఎంతో సాదాసీదాగా, ఫన్నీ పర్సన్‌గా చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. సినిమా శ్రేణుల్లో ఆయన అందరితో సరదాగా కలిసిపోయే తత్వం, సహజంగా పలకరించే తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. భాను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి, స్నేహితులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కాగా విలన్ గ్యాంగ్‌లో కనిపిస్తు కామెడీ క్యారెక్టర్ చేస్తు నవ్వించిన ఫిష్ వెంకట్ కూడా ఇటీవల మరణించిన సంగతి తెలిసింతే ఈ విషాదం మరవక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.