తల్లీ కొడుకులు సహా 8 సరోగేట్ మదర్స్ పోలీసుల అదుపులో..
నవతెలంగాణ -పేట్ బషీరాబాద్
సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ ఘటన మరవకముందే అలాంటి ఘటనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలో మరొకటి వెలుగుచూసింది. తల్లీ కొడుకు సహా 8 మందిని మేడ్చల్ ఎస్‌ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్‌లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పేట్ బషీరాబాద్ పరిధిలో పద్మానగర్‌లో నర్రేదుల లక్ష్మీరెడ్డి అలియాస్ లక్ష్మీ, ఆమె కుమారుడు నర్రేదుల నరేందర్‌రెడ్డి సంతాన లేమితో బాధపడుతున్న దంపతులను లక్ష్యంగా చేసుకొని కొంత కాలంగా వారి ఇంట్లోనే ఆరుగురు సరోగేట్ మదర్స్‌ను పెట్టి వ్యాపారం చేస్తున్నారు. లక్ష్మీరెడ్డి గతంలో ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా పనిచేసిన అనుభవంతో మాదాపూర్‌లోని హెగ్డే, లక్స్ ఆస్పత్రులతో సంబంధాలు పెంచుకుని ఈ వ్యాపారాన్ని సాగించినట్టు వైద్యారోగ్య శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పిల్లలు లేని మహిళలను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి, తన ఇంట్లో ఉంచి సరోగసీ పద్ధతిలో గర్భం దాల్చేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు జేఎన్టీయూలో కెమికల్ ఇంజినీరింగ్ చదివిన ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డి సహకరిస్తున్నాడు. ఇటీవల ఫెర్టిలిటీ కేంద్రాలపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో పోలీసులు వారిపై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6.47 లక్షలు, ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, సిరంజీలు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, 5 స్మార్ట్‌ఫోన్లు, కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎ1 గా ఉన్న నర్రేదుల లక్ష్మీరెడ్డి అలియాస్ లక్ష్మిని గతంలో ఇదే వ్యవహారంలో ముంబయి పోలీసులు పలు సెక్షన్‌ల కింద అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తల్లీకొడుకులతోపాటు అరెస్టయిన సరోగేట్ తల్లులు: గోల్కొండ సాయిలీలా (బీదర్- కర్ణాటక), ఏపీకి చెందిన మలగల్ల వెంకట లక్ష్మి (రంపచోడవరం), పి.సునీత (అల్లూరి సీతారామరాజు జిల్లా), సదల సత్యవతి(రంపచోడవరం), పంటాడా అపర్ణ (విజయనగరం జిల్లా), జె.రమణమ్మ(విజయనగరం జిల్లా) ఉన్నారు. ఇందులో ఇద్దరు ప్రస్తుతం గర్భిణులుగా ఉన్నారు. మీడియా సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.సి. ఉమాగౌరీ తదితరులు పాల్గొన్నారు.