నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత దారుణ హత్యలు మరువకముందే మరో హిందువు యువకుడిపై మూకదాడి జరిగింది. దొంగతనం చేశాడని నెపంతో మూకదాడి వెంబడించింది. దీంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన సదురు యువకుడు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
బంగ్లా మీడియా పేర్కొన్న వివరాల ప్రకారం.. చాక్ గోరి ప్రాంతానికి చెందిన మిథున్ సర్కార్ (25) అనే యువకుడిపై కొందరు దొంగతనం నెపం మోపారు. ఆపై అతడిపై దాడి చేసేందుకు వెంబడించారు. వారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు.. ప్రాణభయంతో ఒక కాలువలోకి దూకాడు. ఆ కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో పాటు.. నీటి ప్రవాహం కూడా బలంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా.. కొన్ని గంటల తర్వాత మిథున్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహాదేవ్ పూర్ పీఎస్ ఆఫీసర్ షాహిదుల్ ఇస్లాం తెలిపారు. ఇప్పటికే మూకదాడుల కారణంగా 11మంది మైనార్టీలు చనిపోయారు.



