– పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం సీఎం రేవంత్ నిర్ణయం
– మంత్రి సీతక్క ప్రతిపాదనలకు ఓకే
– రూ.100 కోట్లు వెచ్చించాలని సర్కారు నిర్ణయం
– కొత్త స్కీమ్ కోసం పలు పేర్ల పరిశీలన
– నవంబరు 19 నాటికి వెయ్యి అంగన్‌వాడీల నిర్మాణం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వాతంత్య్ర దినోత్సవమైన ఈనెల 15న ఒక కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ స్కీమును ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లను మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క చేసిన ప్రతిపాదనలకు సీఎం ఓకే చెప్పారు. 2021లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్-5) ప్రాతిపదికన ఈ పథకాన్ని రూపొందించినట్టు అధికారులు తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్రంలోని చిన్నారుల్లో అత్యధిక మంది పౌష్టికాహార లోపంతో బాధపడ్డారని ఆ సర్వే తేల్చి చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్‌వాడీల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు, తనిఖీలు నిర్వహించటంతోపాటు రోజువారీ పిల్లల హాజరు శాతాన్ని పరిశీలించటం తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఆయా కేంద్రాలకు రాని పిల్లల గురించి వాకబు చేసి, వారి తల్లిదండ్రులకు పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించి చెప్పటం ద్వారా తిరిగి చిన్నారులను అంగన్‌వాడీలకు రప్పించారు. వీటితోపాటు ఆ కేంద్రాల గోడలపై రంగురంగుల పెయింటింగ్స్ వేయించటం ద్వారా పిల్లలను ఆకర్షించారు. ఫలితంగా పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది, కానీ పూర్తి స్థాయిలో ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌లోని డేటా ఆధారంగా కొత్త పథకానికి రూపకల్పన చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కొంత మంది పిల్లల్లో (ఐదేండ్లలోపు) ఎదుగుదల ఆగిపోవటం, వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు లేకపోవటం, ఎనీమియా (రక్త హీనత)తో బాధపడుతుండటం తదితర లక్షణాలు, రుగ్మతలను గుర్తించారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంగన్‌వాడీల్లో అందించే ఆహార పదార్థాలకుతోడు మరిన్ని పోషక విలువలు ఉండే పౌష్టికాహారాన్ని అందించనున్నారు. ఇప్పటిదాకా అంగన్‌వాడీల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే అందించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఉదయం పూట బలవర్దకమైన టిఫిన్ కూడా అందించాలని నిర్ణయించారు. బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా, ఎగ్ బిర్యానీ తదితర వంటకాలను కొత్త మోనూలో చేర్చనున్నారు. ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు, మూడు నుంచి ఆరేండ్ల లోపు పిల్లలకు నెలకు 30 గుడ్లు, కౌమారదశలోని అమ్మాయిలకు తృణ ధాన్యాలు, పల్లీలతో చేసిన చిక్కీలను రోజుకొకటి చొప్పున నెలకు 30 చిక్కీలను అందించనున్నారు. మూడేండ్లలోపు చిన్నారులు అంగన్‌వాడీలకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వారికి నేరుగా ఆయా ఆహార పదార్థాలను ఇంటికే పంపేందుకు చర్యలు చేపట్టనున్నారు.
కాగా ఈ కొత్త పథకానికి పోషణ తెలంగాణ, పౌష్టిక తెలంగాణ, పుష్టి తెలంగాణ తదితర పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఏదో ఒక పేరును త్వరలోనే ఖరారు చేయనున్నారు. దేశంలో సమీకృత మాతా శిశు అభివృద్ధి (ఐసీడీఎస్) పథకాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారనీ అధికారవర్గాలు తెలిపాయి. అందువల్ల ఆమె జయంతి రోజైన నవంబరు 19 నాటికి రాష్ట్రంలో వెయ్యి అంగన్‌వాడీలను కొత్తగా నిర్మించి, ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 35,781 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా, వీటిలో 11,845 సొంత భవనాల్లోనూ, 12,298 అద్దె బిల్డింగుల్లోనూ, మరో 11,638 ఎలాంటి అద్దె లేని భవనాల్లోనూ కొనసాగుతున్నాయి.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 సర్వే ప్రకారం రాష్ట్రంలో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న పిల్లల పరిస్థితి
1) ఎదుగుదల సరిగా లేని పిల్లలు (ఐదేండ్ల లోపు)- 33.1 శాతం
2) బలహీనంగా ఉన్న పిల్లలు (ఐదేండ్ల లోపు)- 21.7 శాతం
3) వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం (ఐదేండ్ల లోపు)-31.8 శాతం
4) ఎనీమియాతో బాధపడుతున్న వారు (ఆర్నెల్ల నుంచి 59 నెలల వరకు)-70 శాతం
5) ఎనీమియాతో బాధపడుతున్న మహిళలు (15 నుంచి 49 ఏండ్లు)-57.6 శాతం
6) ఎనీమియాతో బాధపడుతున్న కౌమారదశలోని బాలికలు (15 నుంచి 19 ఏండ్లు)-64.7 శాతం
7) శిశువు పుట్టగానే ముర్రుపాలు పట్టగలుగుతున్న బాలింతలు -37.1 శాతం
8) అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆర్నెల్ల పిల్లల వరకు పాలివ్వగలుగుతున్న తల్లులు -68.2 శాతం