అధిక ఒత్తిడి వల్లేనని తల్లిదండ్రుల ఆరోపణ
నవతెలంగాణ – నయీంనగర్
హనుమకొండ జిల్లా నయీంనగర్ తేజస్వి ప్రయివేటు స్కూల్‌లో గత నెలలో విద్యార్థి మృతి ఘటన మరువక ముందే గురువారం మరో విద్యార్థి మృతిచెందడం సంచలనంగా మారింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మూడుచెక్కలపల్లి గుండ్ల సింగారానికి చెందిన బానోతు రమేష్, సుజాత దంపతుల కుమారుడు సుర్జీత్ ప్రేమ్ తేజస్విలో 4వ తరగతి చదువుతున్నాడు. అకస్మాత్తుగా క్లాస్‌రూమ్ లోనే కింద పడిపోగా పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. కాగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ డెడ్‌తో మృతిచెందాడని తెలిపారు.
కాగా, పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాజమాన్యం తీరు వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆరోపించారు. పాఠశాలలో ఏదో జరుగుతుందని, యాజమాన్యమే పిల్లాడిని కొట్టి చంపినట్టు అనుమానాలున్నాయని అన్నారు. ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న తమ కుమారుడు ఏవిధంగా చనిపోతాడని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని, విద్యాశాఖ అధికారులు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పాఠశాల వద్ద భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు హనుమకొండ సీఐ శివకుమార్ తెలిపారు.
వరుస మరణాలతో ఆందోళన..
తేజస్వి పాఠశాల విద్యార్థుల వరస మరణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 45 రోజుల క్రితం పదో తరగతి చదువుతున్న జయంతి వర్ధన్ అనే విద్యార్థి పాఠశాల గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా హార్ట్ ఎటాక్ రావడంతో కింద పడి మృతిచెందాడు. ఆ ఘటన నుంచి విద్యార్థులు తేరుకోకముందే మరో విద్యార్థి మృతిచెందడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. కాగా, పాఠశాలలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల అనుమతి రద్దు చేసి పాఠశాలను వెంటనే మూసివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.



