పంటపై ఆశలు వదులుకుంటున్న మిరప రైతులు
ఎన్ని మందులు పిచికారీ చేసినా నియంత్రణలోకి రాని తెగుళ్లు
ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడికి గాను 10లోపే పరిమితం
అటు రేటు లేక.. ఇటు దిగుబడీ రాక దీనావస్థలు
రూ. లక్షలు పెట్టుబడి పెట్టి అర్ధాంతరంగా వదిలేస్తున్న తీరు
ఏటేటా తగ్గుతున్న మిరప సాగు.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో మిర్చి సాగుచేస్తున్న రైతులను నల్లి, తామర పురుగు కారణంగా వ్యాపించే గుబ్బ తెగులు గుబులు పుట్టిస్తోంది. దిగుబడులు లేక, పెట్టుబడులు రాక నష్టాలపాలవుతున్నారు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలోనే రెండు లక్షల ఎకరాలకుపైగా మిరప సాగు చేసేవారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల మేరకు మిర్చి పంట సాగు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 32 వేల ఎకరాల్లో మాత్రమే మిరప సాగు చేశారు. గుబ్బ తెగులు కారణంగా మిర్చి పంటను తొలగించి మొక్కజొన్న, ఆయిల్ పామ్ ఇతరత్ర పంటలు సాగు చేస్తున్నారు. పంటకు తెగుళ్లు సోకుతుండటంతో చీడపీడల నివారణకే ఎక్కువ ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరం పంటను కాపాడుకోవడానికి సగటున నాలుగు రోజులకోసారి రూ.1500-రూ.2600 వెచ్చించి పురుగుమందులు పిచికారీ చేస్తున్నామని పేర్కొంటున్నారు. వీటితో కలిపి దుక్కి దున్నడం, విత్తనాల కొనుగోలు, కూలీలు తదితర ఖర్చుల కోసం ఎకరం మిర్చి పంట సాగుకు రూ. లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఇంత వెచ్చించినా కనీసం పెట్టుబడులు కూడా రాక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో 25-28 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుంది. నల్లమచ్చలు, చీడపీడల కారణంగా 15-18 క్వింటాళ్ల వరకే వస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల రైతులు మిర్చిని తొలగించి మొక్క జొన్న, ఆయిల్ పామ్ వైపు దృష్టి సారిస్తున్నారు.
ఏమి చేసినా తెగుళ్ల నియంత్రణ లేక అవస్థలు
మిర్చిలో గుబ్బతెగులు (గుల్ల తెగులు) ఓ తీవ్ర సమస్యగా మారింది. దీనివల్ల మొక్కలు ఎండిపోయి, పంట నాశనమవుతుంది. గుబ్బతెగులు సాధారణంగా తామర పురుగు (నల్ల తామర), ఇతర సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. ముఖ్యంగా వేడి, పొడి వాతావరణంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ పురుగులు ఆకుల నుంచి రసం పీల్చి వైరస్‌లను వ్యాప్తి చేస్తాయి. దాంతో మొక్కలు బలహీనపడి ఎండిపోయి గుల్లగా మారి పెరుగుదల ఆగిపోతుంది. కొత్త చిగుళ్లు సైతం రాని పరిస్థితి. ముఖ్యంగా నల్లతామర పురుగు, ఇతర తెగుళ్ల వల్ల ఇది సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గుబ్బ తెగులు నివారణకు పురుగుమందులు, సేంద్రీయ పద్ధతులు పాటిస్తున్నా.. మూడు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా తెగుళ్లు నియంత్రణలోకి రావటం లేదని రైతాంగం వాపోతోంది. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టి అర్ధాంతరంగా తోటలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ తెగులు తీవ్రంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పర్యటించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో శాస్త్రవేత్తలు పరిశీలన చేశారు.
పెరిగిన పెట్టుబడులు.. తగ్గుతున్న దిగుబడులు
మిర్చిసాగు తగ్గిపోవడానికి తెగుళ్ల వల్ల పెరిగిన పెట్టుబడులే కారణంగా తెలుస్తోంది. మిర్చి సాగు చేసిన నాటి నుంచి పంటను తెంపడం, ఆరబెట్టడం, మార్కెట్‌కు తరలించి విక్రయించడం వరకు ఇంటిల్లిపాది పనిచేయాల్సి ఉంటుంది. మిర్చి విత్తనాలు, అడుగు మందులు, చీడపీడల నివారణ కోసం వాడే క్రిమిసంహారక మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. కూలీ ఖర్చులు కూడా రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో ఒక ఎకరంలో మిర్చి సాగు చేయాలంటే రూ. 1.80 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. పంటకు వివిధ రకాల చీడపీడలు, పేను బంక, గండు పురుగు, నల్ల తామర వంటి తెగుళ్లు సోకుతుండటంతో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తుంది. చేతికొచ్చిన పంటనైనా మార్కెట్లో అమ్ముదామంటే సరైన గిట్టుబాటు ధర రావడం లేదు.
క్రిమిసంహారక మందుల విపరీత వాడకం ఎఫెక్ట్
క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడుతున్నారన్న కారణంతో తెలుగు రాష్ట్రాల్లో పండించిన మిర్చికి ఆసియా దేశాల్లో డిమాండ్ తగ్గిపోయింది. చైనా, ఇజ్రాయిల్, పాకిస్తాన్‌తోపాటు పలు దేశాల్లో మిర్చి సాగు పెరగడం, అక్కడ కూలీలు, ఇతర ఖర్చులు తక్కువ కావడంతో పంటను తక్కువ ధరకే అమ్మేందుకు సిద్ధపడుతున్నారు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఉమ్మడి ఏపీలోనే ఎక్కువ మిర్చి సాగయ్యేది. నాలుగేండ్ల నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ మిర్చి సాగు పెరిగింది. ఈ క్రమంలో గతంలో రూ.25 వేలు పలికిన క్వింటాల్ మిర్చి ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ.15 వేల మధ్యే ధర పలుకుతోంది. పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
రూ.75 వేల పెట్టుబడి పెట్టి వదిలివేశాను
ఈ ఏడాది 30 గుంటల విస్తీర్ణంలో మిర్చి సాగు చేశాను. పంట చేతికొచ్చే దశలో తెగుళ్లబారిన పడింది. మూడు రోజులకోసారి మందు కొట్టాను. రూ.75 వేల పెట్టుబడి అయింది. ఎంతకూ గుబ్బ తెగులు అదుపులోకి రాలేదు. అంతంతమాత్రంగానే దిగుబడి వచ్చింది. గతంలో ఎకరాకి మైల కాయ 6 క్వింటాల దాకా దిగుబడి వచ్చేది. ఈసారి 80 కేజీలు మాత్రమే వచ్చింది. పెట్టుబడులు కూడా పూడే పరిస్థితులు కనిపించకపోవడంతో వదిలివేయాలనే నిర్ణయానికి వచ్చాను. గతేడాది, ఈ ఏడాది గుబ్బ తెగులుతో వరుసగా నష్టాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఇక మిర్చి జోలికి వెళ్లొద్దని అనుకుంటున్నా. -పెద్ది సైదులుగౌడ్, ముత్యాలగూడెం, కూసుమంచి మండలం
క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సూచనలు ఇస్తున్నాం
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 32వేల ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు. మిరపను ఆశించే సాధారణ తామర పురుగులు, నల్ల నల్లి పంటను ఆశించి నష్టం కలిగిస్తుంది. ఆకుల మీద, పువ్వుల్లో ఎక్కువ సంఖ్యలో నల్లి చేరి గోకి, రసం పీల్చడం వల్ల ఆకులు మాడిపోయినట్టుగా అవుతాయి. ఆకులపై భాగం పసుపు రంగుకు మారి, కింది భాగం ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. పువ్వులను ఆశించి గోకటం వల్ల గోధుమరంగులోకి మారి రాలిపోతున్నాయి. దాంతో కాయల సంఖ్య తగ్గుతుంది. అధిక నత్రజని ఎరువులను వేసుకోకుండా పంటలు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి.
విచక్షణారహితంగా సిఫారసు చేయని పురుగు మందులు వాడొద్దు. వాడిన పురుగు మందులు మళ్ళీ వాడకుండా మందులను మార్చి సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారి చేయాలి. చివరి అస్త్రంగా సస్యరక్షణ మందులైన సయాంట్రానిలిప్రోల్ 1.2 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.32 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 5 ఎస్.సి 2 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 80 డబ్ల్యూ జీ 0.2 గ్రా లేదా ఫిప్రోనిల్‌ంఇమిడాక్లోప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 – 0.25 గ్రా. లేదా స్పైనటోరం 1 మి.లీ. లేదా స్పైరోటే ట్రమాట్ 0.8 గ్రా. లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు.
-ఎంవీ మధుసూదన్, ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి



