నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీ కి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, సిట్ పిటిషన్‌పై నేడు ఏసిబి హైకోర్టు విచారణ చేపట్టింది. మిథున్‌రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు రోజుల పాటు అంటే ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఇక, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేపు అనగా సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మిథున్ రెడ్డిని విచారించనున్నారు.