చదువు మానేసి వెళ్తున్నా… చోద్యం చూస్తున్న అధికారులు
‘స్థానికత’ కోల్పోతున్న విద్యార్థులు
గురుకులాల ప్రవేశ ప్రక్రియలో గందరగోళం
గురుకుల సొసైటీ మొద్దునిద్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తు చేసుకుంటే… ఆసిఫాబాద్‌లో సీటు, నిజామాబాద్ విద్యార్థికి ఆదిలాబాద్‌లో అడ్మిషన్, కామారెడ్డి విద్యార్థికి ఖమ్మలో సీటు, మహబూబ్‌నగర్ విద్యార్థికి వరంగల్‌లో అడ్మిషన్.. ఇలాంటి విచిత్రాలన్నీ సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లోనే సాధ్యం! విద్యార్థులు వారి భవిష్యత్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గురుకులాల పాలకమండలి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఫలితంగా విద్యార్థులు తమ సొంత జిల్లా స్థానికతను కోల్పోతున్నారు. మరికొందరైతే, తమ సొంత జిల్లాలో కాకుండా సంబంధం లేని జిల్లాలో సీటు రావడంతో ‘నీ సీటొద్దు…ఈ సదువొద్దు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. గురుకుల విద్యాసంస్థల అధికారుల తప్పుడు నిర్ణయాల ఫలితంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో సీట్లు భర్తీ కాలేదు. కొన్ని గురుకులాల్లో 40 శాతం విద్యార్థులు కూడా చేరలేదంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అడ్మిషన్ల ప్రక్రియలో మార్పు
ప్రస్తుత విద్యాసంవత్సరంలో గురుకుల విద్యాసంస్థల అధికారులు అడ్మిషన్ల ప్రక్రియ విధానాన్ని మార్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లాల వారీగా మెరిట్‌తో కాకుండా, రాష్ట్ర మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లా విద్యార్థికి ఆదిలాబాద్‌లో, కామారెడ్డి విద్యార్థికి ఖమ్మంలో, మహాబూబ్ నగర్ విద్యార్థికి మరో జిల్లాలో అడ్మిషన్లు ఇచ్చారు. ఇంటర్ ప్రవేశాల్లోనూ ఎస్సీ గురుకులం ఇదే పద్ధతిని కొనసాగించింది. దీంతో విద్యార్థులకు తమ సొంత జిల్లాల్లో కాకుండా ఎక్కడెక్కడో సీట్లు రావడంతో ఆందోళనకు గురువుతున్నారు.
విద్యార్థుల విముఖత
ఎస్సీ గురుకుల పరిధి లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ), సాధారణ ఇంటర్, ఒకేషనల్ జూని యర్ కాలేజీలు కలిపి మొత్తం 238 గురుకులాలు ఉన్నాయి. అన్ని గ్రూపులు కలిపి 19,490 సీట్లు ఉన్నాయి. అత్యధికంగా ఎంపీసీకి 8,360, బైపీసీకి 7,880 సీట్లు ఉన్నాయి. మిగతావి ఎంఈసీ, సీఈసీ గ్రూపులవి. ఏప్రిల్‌లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికే తొలిదశలో అన్ని సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసి అలాట్‌మెంట్ ఆర్డర్లను సొసైటీ జారీచేసింది. కానీ చాలా మంది విద్యార్థులు తమకు కేటాయించిన గురుకులాల్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. చేరిన వారిలోనూ అనేక మంది కేవలం జిరాక్స్ పత్రాలను మాత్రమే సమర్పించి వెళ్లారు. పూర్తిస్థాయిలో అడ్మిషన్ పొందలేదని గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో కూడా ఈ ఏడాది సీట్లు పూర్తిగా భర్తీ కాలేదని సమాచారం. దీనికి కారణం విద్యార్థులు స్థానికత కోల్పోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. దూరప్రాంతాల్లో సీట్లు కేటాయించడం వల్లే ఇలా జరిగినట్టు తెలిసింది.
సొసైటీ నిర్ణయాల ఫలితం…
గురుకుల ఇంటర్ ప్రవేశాలు పూర్తిగా పడిపోవడానికి, విద్యా ర్థులు విముఖత చూపడానికి ప్రధాన కారణం ఎస్సీ గురుకుల సొసైటీ ఇష్టారీతిన తీసుకున్న నిర్ణయాలేనని అక్కడి సిబ్బంది చెప్తున్నారు. ఈ ఏడాది రాతపరీక్షను రద్దు చేశారు. సొసైటీ విద్యార్థులకే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ల్లో ప్రవేశాలు కల్పించారు.
గతంలో…
గతంలో దరఖాస్తులు స్వీకరించే సమయంలో సదరు విద్యార్థికి ఏ జిల్లాలో? ఎక్కడ… ఏ కాలేజీలో, ఏ గ్రూపులో సీటు పొందాలనుకుంటున్నాడు? అనే అంశాలపై ప్రాధాన్యతాపరంగా ఆప్షన్ ఎంచుకునే అవకాశముండేది. విద్యార్థులు కూడా ఆయా కాలేజీల్లోని వసతులు, ఉత్తీర్ణతతోపాటు, దూరభారం లేని కాలేజీలను ఎంపిక చేసుకుని, ఆ విధంగానే దరఖాస్తులు తీసుకునేవారు.
ఇప్పుడు…
ప్రస్తుతం తీసుకునే గ్రూపు తప్ప, కాలేజీని ఎంచుకునే అవకాశాన్ని సొసైటీ దరఖాస్తుల్లో లేదు. దానితో మెరిట్ ఆధారంగా ఇష్టారీతిన విద్యార్థులకు ఆయా కాలేజీలకు కేటాయించారు. పొంతన లేకుండా సుదూర ప్రాంతాల్లో సీట్లను కేటాయించడంతో, విద్యార్థులు అడ్మిషన్‌కు విముఖత చూపుతున్నారని తెలిసింది. ఇప్పటివరకు అడ్మిషన్ పొందిన వారు కూడా తమ సొంతజిల్లాలకే బదిలీ పెట్టుకుంటున్నారని సమాచారం.
సమయపాలన సమస్య
గురుకులాల్లో సమయపాలన విధానం విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు రోబోల్లా తయారవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గురుకుల విద్యాసంస్థల సమయ పాలన మార్పు చేసి, విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మొత్తం 16 గంటల షెడ్యూల్‌లో కనీసం 2.30 గంటల పాటైనా పర్సనల్ టైమ్ లేదనీ, అందులోనే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ పూర్తి చేయాల్సి ఉంటుందనీ, ఇది విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం తరగతులు ప్రారంభమైన తరువాత గంటన్నరకు చిన్న విరామం, మూడున్నర గంటల తర్వాత తిరిగి భోజన విరామం, ఆ తర్వాత గంటన్నర తర్వాత తిరిగి చిన్న విరామం ఉంటుంది.
అధికారులకు పట్టని విద్యార్థుల తిప్పలు
సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గురుకుల సొసైటీలను బాగు చేయకపోగా, కొత్త నిబంధనలు తీసుకొచ్చి పేద విద్యార్థులను పరోక్షంగా చదువుకు దూరం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాల కల్పనపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత సొసైటీ పాలకమండలిపై ఉంది. అసలు విద్యార్థుల బాధలు, సమస్యలు వినే ఓపిక కూడా గురుకులాల అధికారులకు ఉండట్లేదు. ఫలితంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాసంస్థల ప్రతిష్ట మసకబారి, ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పేలా లేదు!!
మార్కులు రాలేదని..
గతంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో మార్కులు సరిగా రాలేదనే కారణాలు చూపి, వాళ్లను సాధారణ గురుకులాలకు మార్చారు. ఇక నాన్ సీవోఈ, ఒకేషనల్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియను కూడా అడ్డదిడ్డంగా చేపట్టారు.
ఇష్టారాజ్యంగా గ్రూపుల మార్పు
దాదాపు 80 గురుకుల కాలేజీల్లో గ్రూపులన్నీ మార్చారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు, ఒకేషనల్ కోర్సుల్లోనూ మార్పులు చేశారు. కొన్ని కాలేజీలను కేవలం సైన్స్ గ్రూపులకు, మరికొన్ని కాలేజీలను ఆర్ట్స్ గ్రూపులకు పరిమితం చేశారు. మరికొన్నింటిలో మిశ్రమ కోర్సులు రన్ చేయాలని నిర్ణయించారు. ఇంటర్ కాలేజీల అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులకు ఇవేవీ వెల్లడించలేదు.
రంగారెడ్డిలో దరఖాస్తు… ఆసిఫాబాద్‌లో సీటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES