Thursday, December 11, 2025
E-PAPER
Homeజాతీయంచార్జీలపై పరిమితుల అమలేది ?

చార్జీలపై పరిమితుల అమలేది ?

- Advertisement -

విచ్చలవిడి ప్రయివేటీకరణ ఫలితమిది
స్వానుభవాన్ని పంచుకున్న సీపీఐ(ఎం) ఎంపీ రహీం


న్యూఢిల్లీ : ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు అత్యధికంగా చార్జీలు పెంచుతుండడంపై కేంద్రం పరిమితులు విధించినప్పటికీ అవి అమలు కావడం లేదని, వాటిని నీరుగారుస్తున్నారని సీపీఐ(ఎం) పార్లమెంట్‌ సభ్యులు ఎ.ఎ.రహీం పేర్కొన్నారు. రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆయన, 1500 కిలోమీటర్లకు పైన గల మార్గాల్లో రూ.18వేల వరకు పెంచు కోవచ్చంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, కానీ అవి ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. 11వ తేదీ నాటికి ఢిల్లీ- తిరువనంతపురానికి ఎకానమీ క్లాస్‌ టిక్కెట్‌ ఏకంగా రూ.64,783 పలికిందని, ఇది తన స్వానుభవమని చెప్పారు. మొత్తంగా ఈ సంక్షోభానికి కారణం ప్రభుత్వమేనని రహీం పేర్కొన్నారు. అడ్డూ అదుపు లేని రీతిలో ప్రయివేటీకరణ, నియంత్రణలు ఎత్తివేయడం వంటి చర్యల ఫలితంగా భారతదేశ పౌర విమానయాన రంగంలో ఈ సంక్షోభం తలెత్తిందని ఆయన విమర్శించారు. 65.6 శాతం విమానాలు ఇండిగో నడుపుతుండగా, 25.7 శాతం విమానాలు ఎయిర్‌ ఇండియా అధీనంలో వున్నాయని, ఆ రకంగా 90శాతానికి పైగా భారత విమానయాన రంగం కేవలం ఇద్దరు బాస్‌లు ఇండిగో, టాటాల చేతుల్లో చిక్కుకుపోయిందని రహీం పేర్కొన్నారు.

ఈ సంక్షోభం కేవలం ఇండిగోది ఒక్కటే కాదని అన్నారు. ఈ మొత్తం వెనుక ఏకైక దోషి కేంద్ర ప్రభుత్వమని చెప్పారు. ఎయిర్‌ ఇండియాను ప్రయివేటీకరిస్తే భద్రత, సేవల నాణ్యత, విమాన నాణ్యత వంటి విషయాల్లో పరిస్థితులు మారతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు పరిస్థితులు మరీ దారుణంగా వున్నాయన్నారు. ప్రభుత్వ రంగం వల్ల ఉపయోగం లేదని, అద్బుతాలు సృష్టించాలంటే ప్రయివేటు రంగంలోనే సాధ్యమని ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రభుత్వం సృష్టించిందన్నారు. ఇండిగో సంక్షోభం సమయంలో టాటా ఎయిర్‌ ఇండియా దోపిడీకి పాల్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు కలిగిన ఇబ్బందుల నుంచి లాభాలు పొందాలని చూసిందన్నారు. ఇక ప్రభుత్వానికి నియంత్రణ ఎక్కడుంది? ప్రయివేటు సంస్థలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -