చీల్చండిరా చీల్చండి
మతం పేరుతో
మనిషిని నిట్టనిలువునా
చీల్చండి. అధికారం కోసం
మీరెంతకైనా తెగిస్తారు
వందల వేల లక్షల
ప్రాణాలైనా హరిస్తారు
ముష్కరుడు ఏమతం వాడైనా
ముష్కరుడే కదరా?
పిట్టలను కాల్చినట్టు
మనుషులను కాల్చేస్తాడు
మానవత్వంతో వాడికేం పని?
విభజించడం.. పాలించడం..
విద్వేష విషపూరిత సిద్దాంతం
ద్విజాతైనా.. బహుళజాతైనా
చీల్చడం చంపడమేగా..
నాక్కావాల్సింది.
నీ క్రూర ఆధిపత్యం కోసం
చంపుకుంటూ, చీల్చుకుంటూ
పోతావురా..?
చరిత్ర ఎన్నిసార్లు చెప్పనా
కళ్ళున్న కబోదివేగా నీవు ?
ఎదుటివాన్ని ఇబ్బంది పెట్టకుండా
బతకడం చేతగాని వాడా?
కనీస ఇంగితజ్ఞానం లేనోడా ?
ఈ భూమ్మీద బతకడానికి
నీ కెంత హక్కుందో
నీ తోటివానికీ
అంతే హక్కుందనీ
సోయి మర్చినోడా… ?
నీవూ ఓ మనిషివేనా..?
ప్రాణం తీయడం తప్ప
పోయడంరెరగని వాడా?
ఏం సాధించావని
ఆ ఉన్మాదం? ఆవీరంగం?
మానవత్వం అంచైనా
తాకావట్రా నీవు?
ముష్కురుడువైతే మాకేమి?
అధినేతవైతే మాకేమి?
ప్రజల నెత్తురు తాగే
పచ్చి ఆయుధ వ్యాపారివైతే మాకేమి?
యుద్ధాలకు నీవు
కారణం కాదా.. ?
మారణహోమానికి
నీప్రేరణ లేదా ?
ఇంకెన్నాళ్ళు ఈ జాతి హననం?
ఈ నరమేధం?
నీ నయవంచన
(అ) నాగరిక భాష
ఎవరికి తెలియదు ?
బుద్దుడు శోధించి తెలిపాడు
అశోకుడు ఆచరించి చూపాడు
అహింసో పరమోధర్మః
గాంధీజీ ఓర్పుగా చెప్పాడు
అంబేద్కర్ నేర్పుగా ఇచ్చాడు
భారత రాజ్యాంగం.
రాజ్యాంగం సాక్షిగా చెప్తున్నాం
శాంతిని సాధిస్తాం
సమానత్వాన్ని నిర్మిస్తాం
మా కాందరి బలిదానంతోనైనా..
కలుపుతాం కలుపుతాం
మనుషుల్ని కలుపుతాం
మానవత్వాన్ని మేల్కొలుపుతాం
రాజ్యాంగం త్రాటిపై
ఒక్కటిగా నిలబడతాం.
- కె.శాంతారావు, 9959745723.