– టీచర్లకు ముఖ్యమంత్రి సూటి ప్రశ్న
– పేదల తలరాతను మార్చేది చదువొక్కటే
– విద్యార్థులకు నమ్మకం కలిగించేలా పనిచేయాలి
– విద్యను వ్యాపారంగా మార్చిన బీఆర్‌ఎస్
– కేజీ టు పీజీ అమలైందా?
– విదేశాల్లో అధ్యయనం కోసం ఏటా 200 మంది టీచర్లను పంపుతాం
– పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా టీఈపీ
– మీరు బాగా పనిచేస్తే మళ్లీ అధికారం మనదే
– ఉత్తమ టీచర్లకు అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 11 వేల ప్రయివేటు పాఠశాలల్లో 34 లక్షల మంది చదువుకుంటున్నారు. దీనికి కారణం మీరా… నేనా?’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయుల్ని ప్రశ్నించారు. ప్రభుత్వ బడులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి ఉపాధ్యాయులు, ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారున్నారని చెప్పారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదనీ, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరమున్నదని తెలిపారు. దానికోసమే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించామనీ, ఏటా రూ.130 కోట్ల నిధుల్ని కేవలం స్కూల్స్ నిర్వహణ కోసం మంజూరు చేస్తున్నామని వివరించారు. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, యోగానంద్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, విద్యాశాఖ కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఐఏఎస్ అధికారులు శ్రీదేవసేన, కృష్ణఆదిత్య, నవీన్‌నికోలస్, హరితతోపాటు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు పంచేందుకు భూముల్లేవనీ, కేవలం చదువొక్కటే పేదల తలరాతను మార్చి, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు కూడా తినాలనీ, అప్పుడే భోజనంలో నాణ్యత తెలుస్తుందన్నారు. ఫుడ్ పాయిజన్ వంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పారు. గతంలో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గేదనీ, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుత విద్యాసంవత్సరంలో మూడు లక్షల మంది విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు. దీనిలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. పేద పిల్లలు ప్రయివేటు పాఠశాలలకు ఎందుకెళ్లాలని ప్రశ్నించారు. ఆ చదువులు ప్రభుత్వ బడుల్లో చెప్పలేమా? అని అడిగారు.
విద్యాశాఖను నేనే పర్యవేక్షిస్తా
గతంలో ముఖ్యమంత్రులు రెవెన్యూ, ఆర్థిక, నీటిపారుదల శాఖలను పర్యవేక్షించే వారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ తాను విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. కొందరు విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలంటూ తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. విద్యా శాఖలో సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం తానే చేస్తానన్నారు. గడచిన పదేండ్లలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందనీ, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిన ఆనాటి పాలకులు దాన్ని అమలు చేశారా?అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదనీ, 2017లో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 55 రోజుల్లో 11 వేల టీచర్ల పోస్టుల్ని భర్తీ చేశామని తెలిపారు.
ఓయూ మూతపడే పరిస్థితి
బీఆర్‌ఎస్ హయాంలో విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారనీ, ఆనాటి ప్రజాప్రతినిధులు ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ పోస్టులను నియమించకుండా యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారనీ, ఓ దశలో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) మూతపడే పరిస్థితికి వచ్చిందనీ, కేయూ కళావైభవం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ఆలోచన కూడా ఆనాటి పాలకులకు చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టామన్నారు. గతంలో ఏనాడైనా గురుపూజోత్సవానికి సీఎం వచ్చారా అని అడిగారు.
అధ్యయనం కోసం విదేశాలకు ఉపాధ్యాయులు
విద్యలో ప్రపంచంతో పోటీపడేలా విధానాలు రూపొందించాల్సి ఉందని సీఎం చెప్పారు. దానికోసం విద్యారంగాన్ని అధ్యయనం చేసేందుకు ఏటా 200 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తామన్నారు. సింగపూర్, వియత్నాం, జపాన్, ఫిన్‌లాండ్ దేశాలకు పంపిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రానికి నూతన విద్యావిధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. దీనికోసం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అధ్యక్షతన కమిటీని నియమించామని చెప్పారు. పేద పిల్లల విద్యాపునాదుల్ని బలంగా నిర్మించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని గుర్తుచేశారు. చదువుతో పాటు విద్యార్థులకు ఆటలు, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అవసరమనీ, దానికోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలు, స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయివంటి మత్తులో పడకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లపై ఉందనీ, వాటిపై ఉక్కుపాదం మోపేందుకే ఈగల్‌ఫోర్స్‌ను తెచ్చామని వివరించారు. తెలంగాణను పునర్నిర్మాణంలో అందరూ కలిసిరావాలని కోరారు. ఉపాధ్యాయులు సమర్థవంతంగా పనిచేస్తే, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
బడిని గుడిగా మారుస్తున్నారు యోగితారాణా
రాష్ట్రంలో అనేకమంది ఉపాధ్యాయులు బడిని గుడిగా మారుస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి మంచి సమాజాన్ని నిర్మాణానికి కృషి చేస్తున్నారని ప్రసంశించారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తూనే, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ప్రయివేటు బడుల్లో పిల్లలు పెరగడానికి కారణం మీరా…నేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES