చెత్త ఎవరో సత్తా ఎవరిదో అర్థమవుతుంది : రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. పదేండ్లలో బీఆర్‌ఎస్, రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకుందామని చెప్పారు. అప్పుడు చెత్త ఎవరో, సత్తా ఎవరిదో తెలుస్తుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, గాంధీభవన్, జూబ్లీహిల్స్ ప్యాలెస్, అసెంబ్లీకైనా వచ్చి చర్చించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంలో రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తిట్టినా సీఎం కాబట్టి తాము గౌరవంగానే మాట్లాడుతామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ హయాంలో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామని వివరించారు. కాంగ్రెస్ కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా వేసిందా?, ఒక్క ఫ్లైఓవర్‌ను నిర్మించారా?అని ప్రశ్నించారు.
కొత్త రోడ్ల సంగతి తర్వాత ఉన్నవి గుంతలమయం అయ్యాయనీ, వాటిని పూడ్చారా అని నిలదీశారు. హైదరాబాద్ ప్రజలు మళ్లీ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. హైదరాబాద్‌లో చెత్త సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్‌ఎస్ అని గుర్తు చేశారు. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ప్రాంతాన్ని పర్యవేక్షించారని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టామని వివరించారు. ఇప్పుడు కనీసం ఒక్క ఆటోనైనా కొన్నారా?అని ప్రశ్నించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు పొందామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఎస్‌ఎన్‌డీపీని ప్రారంభించామని చెప్పారు. పదేండ్లలో కేసీఆర్ హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మారిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆరోపించారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ఒక్క ఇల్లైనా కట్టిందా?అని ప్రశ్నించారు. ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇండ్లను హైడ్రా పేరుతో ఈ ప్రభుత్వం కూలగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న గన్ కల్చర్
రాష్ట్రంలో పర్యావరణం, పచ్చదనాన్ని పెంచడం కోసం 16 వేల నర్సరీలను ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క నర్సరీ కూడా పెట్టకపోగా.. ఉన్న చెట్లను నరికేస్తున్నదని అన్నారు. రూ.10 వేల కోట్ల కోసం కక్కుర్తిపడి హెచ్‌సీయూలో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగాలను మూడు లక్షల నుంచి తొమ్మిది లక్షలకు పెంచామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ శాంతి భద్రతలను పెంచారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరుగుతున్నదని చెప్పారు.
ముస్లింల కోసం కాంగ్రెస్ హిందువుల కోసం బీజేపీ లేదని చెప్పారు. భారత్ లౌకిక దేశమనీ, ఎవరికి నచ్చిన మతంలో వారుంటారని వివరించారు. ఫార్ములా ఈ కార్ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారని అన్నారు. చార్జ్‌షీట్‌లో విషయం లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని చెప్పారు. తాను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమనీ, రేవంత్‌రెడ్డి కూడా సిద్ధమేనా?అని ప్రశ్నించారు. దీంతో ఎవరు దొంగో తేలిపోతుందన్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లినందున ఈనెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



