గర్భిణుల్లో తలెత్తే ముఖ్యమైన సమస్యల్లో నిద్ర లేమి ఒకటి. నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట పెరగడంతో పాటు ఆయాసం, అసౌకర్యం అనిపిస్తుంటుంది. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం…
వ్యాయామం చేయండి: కొంతమంది మహిళలు ప్రెగెన్సీ టైంలో ఏ పనీ చేయకుండా పూర్తిగా విశ్రాంతి కోరుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదని నిపుణులు చెప్తున్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలుండి, డాక్టర్లు సలహా ఇస్తే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోవడం సరికాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తేలిక పాటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇటు తల్లికి, అటు కడుపులోని బిడ్డకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇలా చేయడం రోజంతా ఉత్సాహంగా ఉండడంతో పాటు రాత్రి కూడా హాయిగా నిద్రపోవచ్చని అంటున్నారు. అలాగని రాత్రి పడుకునే ముందు కాకుండా డాక్టర్లు సూచించిన టైంలో వ్యాయామం చేయడానికి తగిన సమయాన్ని కేటాయించుకోవాలని తెలిపారు.
ఒత్తిడికి దూరంగా: ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా రాత్రిపూట నిద్ర పట్టకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో, ఆఫీసులో ఉండే కొన్ని రకాల సమస్యలు, ప్రసవం గురించిన భయాలు నిద్రలేమికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే దీని వల్ల మీకు, కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచిది కాదని సూచిస్తున్నారు. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకొని హాయిగా నిద్రపోయే మార్గాలేంటో సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
టైం సెట్ చేసుకోండి: రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం లాంటివి అలవాటు చేసుకోవడం రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే పడుకునే ముందు టీవీ చూడటం, సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. వీలైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం వంటి అలవాట్ల వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. నిద్రపోయే ముందు సోడా, కాఫీ, టీ వంటి పానీయాలను తగ్గించుకోవడం లేదా పరిమితం చేసుకోవాలని ఓ అధ్యయనం వెల్లడించింది. అలాగే నిద్రకు కనీసం గంట ముందు తల, కాళ్లను సున్నితంగా మసాజ్ చేయించుకుంటే నరాలు ఉత్తేజితమై హాయిగా నిద్ర పడుతుంది.
వీటికి దూరంగా: నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి ఆహార మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్బోనేటేడ్ పానీయాలు, సిట్రస్ పండ్లు, టమోటాలు, కారం లేదా కొవ్వు పదార్థాలని నివారించాలని అంటున్నారు. అంతేకాకుండా నిద్రపోయే ముందు మూడు నుంచి నాలుగు గంటల లోపు తినడం మానేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్రపట్టడం లేదా..?
- Advertisement -
- Advertisement -