No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeమానవిడిప్రెష‌న్ కి లోన‌వుతున్నారా?

డిప్రెష‌న్ కి లోన‌వుతున్నారా?

- Advertisement -

నిరాశ-నిస్పృహ- దిగులు- మాంద్యం. ఒకటితో ఇంకొకటి ముడి వేసుకొని ఉంటాయి. వీటి కారణాలనేకం. పాత జ్ఞాపకాలు, కనుమరుగైపోయిన సన్నిహితులు, పరిస్థితులు, తిరిగి రావనిపించే మధుర స్మృతులు వంటివి గడిచిపోయిన జీవితానికి సంబంధించిన కారకాలైతే, అనుకూలంగా లేని సమకాలీన పరిస్థితులు, భవిష్యత్తు గురించి అనిశ్చిత భావాలు ప్రస్తుత కారకాలు కావచ్చు. నిరాశ చెందడం, దాని కారణంగా వ్యాకులతకు లోనవడం అసహజమేమీ కాదు. దీని గురించి కొంత అవగాహన పెంచుకుంటే బయటపడడం సులభమే.

మన అదుపులో లేనటువంటి వాటి గురించి ఆలోచించడం, బాధపడటం సాధారణంగా ప్రతి ఒక్కరికీ జరుగుతూనే ఉంటుంది. కానీ అతిగా ఆలోచించడం, బాధపడుతూ, ఆ స్థితిలోనే ఉండిపోవడం జరుగుతుంటే మానసిక రుగ్మతగా పరిగణింపబడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. హార్మోన్ల ఒత్తిడితో, శారీరిక, మానసిక స్థితులు, నిత్యం మార్పులకు లోనౌతుండడం వలన స్త్రీలు, పురుషలకంటే రెండు రెట్లెక్కువగా మాంద్రానికి గురౌతారని, వారిలో దాని తీవ్రత కూడా ఎక్కువ మోతాదులో ఉండే అవకాశాలున్నాయని, ప్రపంచవ్యాప్త అధ్యయనాల్లో వెల్లడైంది.

నిరాశ చెందటానికి కారణాలు?
దీర్ఘ కాల అనారోగ్యం ప్రధాన కారణం శారీరిక, మానసిక, సాంఘిక అనారోగ్యం తద్వారా ఆత్మిక కుంగుపాటు, ఏమీ చేయలేని దుస్థితి. రోజు వారీ జీవనాన్ని అతలాకుతలం చేసి, ఎటువంటి వైద్యపరీక్షలకీ అవగతం కాని, మందులకీ లొంగని, కడుపు, కీళ్ళ, వెన్ను, కండరాల నొప్పులు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బు వంటి జీవన శైలి సంబంధిత వ్యాధులు. వృద్ధాప్య జబ్బులు, థైరాయిడ్‌, కాన్సర్‌, ఆటోఇమ్మ్యూన్‌ జబ్బులు, కొన్ని రకాల అంటు వ్యాధులు, నిత్య జీవనాన్ని కలవరపరచే శారీరిక ఆరోగ్యపర కారణాలు.

మరింతగా కృంగిపోయి…
కొన్ని రకాల మందులు వాడకం వలన, మాదకద్రవ్యాలు, మితిమీరిన మద్య సేవనం, ఆహారంలో సూక్ష్మ పోషకాల లోపం, జన్యుపరమైన కారణాలు, జీవితంలో అనుకోని దుర్ఘటనలు.. ఇలా కారణాలు ఎన్నెన్నో కావచ్చు. ఇవన్నీ తీవ్రరూపం దాల్చినప్పుడు మానసిక, సాంఘీక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కుటుంబ సభ్యుల్లో నిరసన కనిపించవచ్చు. దాంతో మానసికంగా మరింతగా కృంగిపోయి తమని తాము ఒంటరి చేసుకొంటారు. ఆత్మ న్యూనత, నకారాత్మక ప్రవృత్తి వంటివి మొదలయ్యి పరిస్థితి ఇంకా తీవ్రతరమై, స్వీయహానికి దారితీయొచ్చు. వీటికి సామాజిక, సాంస్కృతిక కారణాలు తోడై తరచుగా ఒత్తిడితో కూడుకొన్న క్లిష్టతరమైన పరిస్థితులకు లోనౌతుంటారు.

రుతుస్రావంతో ముడిపడి…
మరింత వివరణలోకి వెళితే ఆడవారు రజస్వల వయసు నుండి రుతుక్రమము సర్దుకొనే వరకు ఒక రకమైన ఒత్తిడికి గురౌతే, ఆ తర్వాత వారి శరీర పనితీరు మొత్తం రుతుస్రావ, గర్భ, రుతువిరతితో ముడిపడి ఉంటుంది. చాలామంది యువతులు నెల మధ్యలో, అండాశయ నొప్పి (మిట్టల్ష్ముర్జ్‌ పెయిన్‌) రుతుస్రావానికి రెండు మూడు రోజుల ముందు నుండి పీఎంఎస్‌ (ప్రీ మెన్స్ట్రుల్‌ సిండ్రోమ్‌)తో బాధపడుతుంటారు. గర్భం ధరించిన దశలో అనేక శారీరిక మానసిక ఇబ్బందులకు గురౌతుంటారు. శిశు పోషణ, సంరక్షణ పరంగా మరెన్నో అవస్థలు పడుతుంటారు. ఉద్యోగస్తులైన స్త్రీలైతే ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవాల్సివస్తుంది. అటువంటప్పుడు, కుటుంబపరంగా అన్ని సజావుగా జరగాలంటే, వారికి కుటుంబసభ్యుల సహకార, సహానుభూతులు, ఆలంబన ఎంతో అవసరం. అది దొరకని పరిస్థితులలో, దొరకక పోవడమే కాకుండా, అటువంటి ఇబ్బందుల్ని వ్యక్తం చేసినందుకు, హాస్యాస్పదంగా లేదా కించపరిచే విధంగా అగౌరవపరచడం వంటివి జరిగినప్పుడు, ఎనలేని నిరాశానిస్పృహలకు లోనౌతారు. కొందరిలో ప్రసవం తర్వాత ప్రసవానంతర మాంద్యం కలుగవచ్చు. ఆర్థిక, మానసి,క లైంగిక వేధింపులు వంటి సాంఘిక కారణాలు వీటికి తోడవవచ్చు. సామాన్యంగా తీవ్ర నిరాశానిస్పృహలు, దీర్ఘ, నిరంతర ఒత్తిడి, దాని నుండి పలాయన- పోరాట ప్రతిస్పందనలు, శూన్య/ దుష్ఫలితాలు పలుమార్లు పునరావృతమైన తర్వాత కలిగే నిస్సహాయత స్థితి లోంచి మాంద్యం మొదలౌతుంది.

ఎలా తెలుసుకోవాలి?
నిరంతరంగా ఎవరికీ అంతుబట్టని విధంగా అకారణంగా విచారంగా ఉండటం, వెలితిని అనుభూతి చెందడం, అనవసరంగా కోపగించుకోవడం, ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ ఎదో పోగుట్టుకున్నట్టుగా దిగులుగా ఒంటరిగా ఉండటం, ఆకలి లేకపోవటం, ఇతరులను పట్టించుకోక పోవడం, ఆరోగ్యం పట్ల ధ్యాస క్షీణించటం, అనాయాసంగా అలసిపోవడం, నిద్ర పట్టకపోవడం, అంతుబట్టని నొప్పులు, ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండటం, స్వీయహాని కలిగించే చర్యలకు పాల్పడడం వంటివి చేయవచ్చు. మాంద్యగ్రస్తులందరూ ఒకేలా ప్రవర్తించరు. అన్ని సూచికలూ ఉండకపోవచ్చు. వైద్యపరంగా సూచికలను బట్టి మేజర్‌, పెర్సిస్టెంట్‌, సీసనల్‌, అఫేక్టీవ్‌ డిప్రెస్సివ్‌, బైపోలార్‌ డిసార్డర్‌గా విభజించారు.

మాంద్యానికి లోనైతే?
మాంద్యానికి జాతి, కుల, మత, స్థాయి భేదాలు లేవు. అయితే చిన్నపిల్లల్లో ఈ స్థితి సామాన్యంగా కనిపించదు. లోనైనప్పటికీ తొందరగా దాని నుండి బయటపడగల్గుతారు. మిగితా అందరూ ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత నిరాశానిస్పృహలకు లోనౌతూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులెందరో ఈ దశను చవి చూసిన వారే. మాంద్యంతో పోరాడి గెలిచిన వారు, తమ పోరాటాల్ని సామాజిక, అంతర్జాల వేదికలపై అందరితో పంచుకుంటూ ఉంటారు. మాంద్యం నిత్య జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ దశలో వ్యక్తులు ఆత్మ న్యూనతకు గురై స్వీయ హాని మాత్రమే కాకుండా వారి పైన ఆధారపడినవారికీ హాని కారకులౌతారు. కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఎంత ప్రియమైన వ్యక్తులైనా, వారి ఓపిక నశించి, వీరిని పట్టించు కోవడం మానేయవచ్చు. లేదా వారూ మాంద్యానికిలోను కావచ్చు.

బయట పడటం ఎలా?
స్వీయ సహాయానికి మించినదేదీ లేదు. ప్రకృతి, మానవ జీవన సుగమనానికి కొన్ని నిర్దిష్టమైన పద్ధతుల్ని, నిరంతరంగా అమలుపరుస్తుంది. అందులో ప్రధానమైనవి.. అన్ని కాలచక్రంలో కలిసిపోతాయి, మార్పు సహజం, ఈ ప్రస్తుత పరిస్థితితో సహా ఏదీ శాశ్వతం కాదు.. ఈ అక్షర సత్యాలను మానసికంగా నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇదొక రకమైన స్వీయ సంప్రదింపు చర్య. విజ్ఞతతో ఓర్పుగా చేసుకోగలిగితే దీనికి మించిన పరిష్కారం ఇంకొకటి లేదు. మన సమస్యలు మనకు తెలిసినంతగా వేరెవరూ, వైద్య నిపుణులతోసహా, తెలుసుకోలేరు. మనసువిప్పి మాట్లాడుకోగలిగే బాంధవి స్నేహితురాలుతో పంచుకోవడం వలన కూడా కొంత ఓదార్పు లభిస్తుంది. మంచి ఆహారం, వ్యాయామం, పుస్తక పఠనం, సామజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అభిరుచులను పెంపొందించుకోవడం, ఇష్టమైన పనుల్లో స్వయాన్ని నిమగం చేసుకోవడం ద్వారా మాంద్యాన్ని నియంత్రించవచ్చు. తీవ్ర స్థాయి మాంద్యానికి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందటం అనివార్యం.

– డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad