Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిశాంతికోసం ఆయుధపాటవం!

శాంతికోసం ఆయుధపాటవం!

- Advertisement -

జపాన్‌పై చైనా సాధించిన విజయం, ఫాసిస్టు వ్యతిరేక విజయాల 80వ వార్షికోత్సవాన్ని బుధవారం నాడు బీజింగ్‌లో నిర్వహించిన తీరును చూసి యావత్‌ ప్రపంచం నివ్వెరపోయిందంటే ఆశ్చర్యం లేదు. తన అమ్ముల పొదిలో ఉన్న అనేక అత్యాధునిక అస్త్రాలను ప్రదర్శించారు. రష్యా నేత వ్లదిమిర్‌ పుతిన్‌, ఉత్తరకొరియా కిమ్‌ జోంగ్‌ అన్‌తో సహా మొత్తం పాతిక దేశాల నేతల సమక్షంలో చైనా తన సత్తా ఏమిటో లోకానికి తెలియచేసింది. సామ్రాజ్యవాదుల దురాక్రమణ, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రెండు కోట్ల మంది చైనీయుల అసమాన ప్రాణ త్యాగాలు, జపాన్‌ దుర్మార్గాలను 140 కోట్ల తన జనంతో పాటు యావత్‌ ప్రపంచానికి చైనా కమ్యూనిస్టులు మరోసారి గుర్తు చేశారు.ప్రపంచానికి ఫాసిస్టు, నాజీల ముప్పు 1939లో తలెత్తితే చైనాలోని మంచూరియాను 1931లోనే ఆక్రమించుకొనేందుకు జపాన్‌ పూనుకుంది. అందుకే దానిపై విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చైనా మిలిటరీ పెరేడ్‌కు హాజరు కావద్దంటూ జపాన్‌ బహిరంగంగా పిలుపునిచ్చిందంటే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా జపాన్‌ ఉందన్నది స్పష్టం. అందుకే మరోసారి యావత్‌ ప్రపంచ మానవాళి ముందు శాంతా లేక యుద్ధమా, చర్చలా లేక సంఘర్షణా అన్నది ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, చైనా పౌరులు చరిత్రలో సరైన పక్షాన్నే నిలుస్తారని అధినేత షీ జింపింగ్‌ స్పష్టం చేశారు. మానవాళి పురోగతి, శాంతియుత అభివృద్ధి, అన్యోన్యమైన భవిష్యత్‌ కోసం మిగతా ప్రపంచంతో చేతులు కలుపుతామని అన్నారు. శాంతికోసం నిలిచేవారు ఆయుధపాటవాన్ని పెంచుకోవటం, దాన్ని ప్రదర్శించటం ఎందుకన్న ప్రశ్న తలెత్తటం సహజం.
ప్రపంచాన్ని చుట్టి చంకలో పెట్టుకోవాలని చూసిన శక్తులు ఆయుధాలను రూపొందించి ప్రతిఘటించినవారి మీద వాటిని ప్రయోగించిన దుర్మార్గ చరిత్ర గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో అవసరం లేకపోయినా చేతులెత్తేసిన జపాన్‌ మీద అమెరికా అణుబాంబులు ప్రయోగించింది.తాము ఎంతటి శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేశామో, అది ఎంతటి మారణ కాండను సృష్టిస్తుందో చూడండి అంటూ జనం మీద ప్రత్యక్షంగా ప్రయోగం చేసి ప్రపంచాన్ని భయపెట్టేందుకు పాల్పడిన దుర్మార్గమది. అందుకే దానికి ప్రతిగా సోవియట్‌ యూనియన్‌, చైనా అణు బాంబులు, ఆధునిక ఆయుధాలను రూపొందించాల్సిన అనివార్యత ఏర్పడింది. అవి ఆ పనిచేశాయి గనుకనే ఎనిమిది దశాబ్దాలుగా మరొక ప్రపంచ యుద్ధం రాలేదు. అమెరికా, ఇతర పశ్చిమదేశాలు ఆ యుద్ధం తర్వాత అనేక నూతన ఆయుధాలను రూపొందించాయి. అవెలా పనిచేస్తున్నాయో ప్రత్యక్షంగా చూసేందుకు వియత్నాం, ఇరాన్‌, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, లిబియా తదితర దేశాలపై ప్రయోగించి నిర్ధారణ చేసుకోవటమే కాదు, వాటిని చూపి బెదిరిస్తున్నాయి. నాటో పేరుతో నాటి సోవియట్‌ యూనియన్‌, నేటి రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌, దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛా రవాణా పేరుతో చైనాకు వ్యతిరేకంగా పరిసర దేశాల్లో మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసిన అమెరికా నిత్యం ఎలా కవ్విస్తున్నదో చూస్తు న్నాం. చైనా, రష్యాల ఆయుధాల తయారీ, ప్రదర్శనలు, విన్యాసాలు తమ జాగ్రత్తలను తాము తీసుకోవటంలో భాగమే. మరోమాటగా చెప్పాలంటే శాంతికోసం బలప్రదర్శన అనవచ్చు.
సోవియట్‌ యూనియన్‌, తర్వాత రష్యా కొనసాగిస్తున్న ఆయుధాలను అనేక యుద్ధాల్లో ప్రయోగించారు. కానీ చైనా తయారీ ఆయుధాలు తొలిసారిగా ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాకిస్తాన్‌ ప్రయోగించటం తప్ప మరోచోట జరగలేదు. అది కూడా చాలా పరిమితంగానే అన్నది తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకొని చైనా ఆయుధాలు నాణ్యతలేనివని, పనికిరానివి అంటూ అనేక మంది వర్ణిస్తున్నారు.అయితే ఇటీవలి కాలంలో అనేక రంగాల్లో చైనా సాధిస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనలను చూసిన తర్వాత కూడా అలాంటి కథనాలను ఎవరైనా నిజమనుకుంటే పప్పులో కాలేసినట్లే. చైనా వస్తువులను కూడా అలాగే చిత్రించి ఇప్పుడు వాటికోసమే వెంపర్లాడుతున్న దేశాలను చూస్తున్నదే. అణ్వాయుధాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణులు, భూమి, సముద్రం, గగనతలం నుంచి ఏకకాలంలో ప్రయోగించగల నియంత్రిత అధునాతన మిసైళ్లు, ఐదవతరం స్వంత యుద్ధ విమానాలు, మానవరహిత డ్రోన్లు,ఇతర ఆయుధాల వంటి వాటిని చైనా ప్రదర్శించింది. ఈ చర్య ఏ దేశాన్ని ఉద్దేశించకపోయినప్పటికీ అమెరికా,దాని అడుగుజాడల్లో నడిచే దేశాలకు హద్దులు మీరితే కబడ్దార్‌ అనే ఒక హెచ్చరిక ఇది!

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad