188 మెడల్స్ వితరణ చేసిన గంగావత్ శ్రీకాంత్
నవతెలంగాణ- వీర్నపల్లి
దేశ రక్షణలో భాగస్వాములవుతూనే, పుట్టిన ఊరిపై మమకారంతో విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తున్నారు. ఆర్మీ జవాన్ గంగావత్ శ్రీకాంత్ వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, విద్యార్థులకు నిర్వహించే క్రీడా పోటీల విజేతల కోసం ఆయన 188 మెడల్స్‌ను విరాళంగా అందజేశారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్, ఎస్సై వేముల లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ మెడల్స్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ కు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్ శ్రీకాంత్, సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో కూడా పాఠశాల విద్యార్థుల గురించి ఆలోచించి, వారిలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం ఉప సర్పంచ్ జక్కుల నరేష్, సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు భగ వంతం, సంజీవ్,గోరెమియ, దేవా లక్ష్మి,నాయకులు నవీన్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.



