నవతెలంగాణ-హైదరాబాద్: లగేజీకి అదనపు ఛార్జీ చెల్లించాలన్న స్పైస్ జెట్ ఉద్యోగులపై ఆర్మీ అధికారి ఒకరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఉద్యోగి వెన్నెముక విరిగిపోగా, మరో ఉద్యోగి దవడ ఎముకకు తీవ్ర గాయమైనట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గతవారం శ్రీనగర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. సీనియర్ ఆర్మీ అధికారి 16 కిలోల బరువు కలిగిన రెండు క్యాబిన్ లగేజీలు తీసుకువెళ్తున్నాడు. సాధారణంగా 7 కిలోల వరకు విమానంలోకి అనుమతిస్తారు. లగేజీ రెట్టింపు బరువు ఉండటంతో సిబ్బంది అదనపు ఛార్జీ చెల్లించాల్సి వుందని స్పైస్ జెట్ సిబ్బంది తెలిపారు. అయితే అతను నిరాకరించి, బోర్డింగ్ పూర్తికాకుండానే ఏరోబ్రిడ్జిలోకి ప్రవేశించాడు. ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించడమేనంటూ సిబ్బంది అతన్ని అడ్డుకుని తిరిగి గేటు వైపు తీసుకువెళ్లాడు. ఆగ్రహించిన ఆర్మీ అధికారి గ్రౌండ్ సిబ్బందిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఒక ఉద్యోగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని వెన్నెముక విరిగినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఉద్యోగి ముక్కు, దవడకు గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. ఆర్మీ అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అన్నారు. ఆ అధికారిని నో ఫ్లై జోన్‌లో చేర్చనున్నట్లు వెల్లడించారు. ఆర్మీ అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన మంత్రికి లేఖ రాసినట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.