డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్, అబ్జర్వర్
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రి తో సిబ్బంది తరలింపు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వసతులు, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామని అన్నారు.
గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలు ఈ నెల 14న జరుగనున్న నేపథ్యంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్పల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్
క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందల్వాయి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు.
ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఇదిలాఉండగా, నిజామాబాద్, మాక్లూర్, మోపాల్ తదితర మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సందర్శించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా, జిల్లాలో రెండవ విడతగా ఈ నెల 14న పోలింగ్ నిర్వహించనున్న మండలాల్లో పోలింగ్, కౌంటింగ్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరిచూసుకోవడం జరిగిందన్నారు. తాగునీరు, వీల్ చైర్ వంటి వసతులతో పాటు, ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ప్రతి పీ.ఎస్ లో ఓటర్లకు సహకరించేలా బీ.ఎల్.ఓలతో కూడిన హెల్ప్ డెస్క్ లు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. 44 గంటల సైలెన్స్ పీరియడ్ లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా నిఘా బృందాలు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు.
ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించేలా కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిగేలా 56 మంది సూక్ష్మ పరిశీలకులతో పాటు, 34 మంది జోనల్ అధికారులను నియమించి, అన్ని చర్యలు తీసుకున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని, 61 పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
కాగా, రెండవ విడతలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికే 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. మిగతా 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 568 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వివరించారు. అదేవిధంగా మొత్తం వార్డు స్థానాలు 1760 ఉండగా, 5 వార్డు స్థానాలకు
నామినేషన్లు దాఖలు కాలేదని, 674 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 1081 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 2634 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు. రెండవ విడతలో మొత్తం 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,38,838 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1476 మంది ప్రిసైడింగ్ అధికారులను, 1937 మంది ఓపీవోలను నియమించామని అన్నారు. మొదటి విడత తరహాలోనే మలి విడత ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.



