– పాట ప్రజల పక్షాన నిలబడాలి : తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి ఆనందచారి
– ఇబ్రహీంపట్నంలో కవులు, కళాకారుల సమ్మేళన సదస్సు
నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం
శ్రామిక ప్రజల ఓదార్పు నుంచి పుట్టిందే కళ అని తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి ఆనందచారి అన్నారు. పాట ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. తెలంగాణ సాహితి సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శుక్రవారం కవులు, రచయితలు, కళాకారుల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు- సమ్మేళన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పాట ఎండగట్టాలన్నారు. ఈ మధ్యకాలంలో ఆ ప్రయత్నం జరగడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. పాట ప్రజాపక్షాన్ని వదిలేసిందని, ఫలితంగా ప్రభుత్వాలు సైతం ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని అన్నారు. 79 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో ఉపాధి దొరక్క.. కన్నీళ్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కరువైందన్నారు. కార్మికులు తాము పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు కూడా ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో శ్రామిక ప్రజల జీవన సౌదర్యం నుంచి పుట్టిన పాటను వారి కోసమే ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వాలు మతం, కులం పేరుతో సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రజల మధ్య విభజనను సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణం కోల్పోయిన భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావుల పేర్లు నేడు వినబ డటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ.. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ల పేర్లు వల్లే వేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధులు, శ్రమ జీవులకు విముక్తి కల్పించిన పోరాటాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు అందుకు కళాకారులు కళారూపాల ద్వారా వివరిం చాలని చెప్పారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు, రచయితలు.. గ్రామీణ కళలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు సలీమ, రచయిత బండి సత్తన్న, భాస్కర్, ఆలేటి ఆటం, ఆయా ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు పురుషోత్తం, బ్రహ్మయ్య, జానీ, అరుణ్ కుమార్, ఇబ్రహీం, బుగ్గ రాములు, యాదయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గణేష్, జిల్లా నాయకులు ఎంజే వినోద్‌కుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.
శ్రామిక ప్రజల ఓదార్పు నుంచి పుట్టిందే కళ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES