370 ఆర్టికల్‌, ట్రిపుల్‌ తలాక్‌ రద్దుకు లేని కమిటీ… వర్గీకరణకు ఎందుకు

– బీజేపీకి సతీష్‌ మాదిగ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
370 ఆర్టికల్‌, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసేందుకు అవసరం లేని కమిటీ, షెడ్యూల్‌ కులాల వర్గీకరణకు ఎందుకని మాదిగ దండోరా అధ్యక్షులు, కాంగ్రెస్‌ నేత దేవనీ సతీష్‌ మాదిగ కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 జిల్లాల మాదిగ దండోరా ఉద్యమకారులు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వర్గీకరణ కోసం ఉషామెహ్రా కమిషన్‌ వేసిందని తెలిపారు. అందుకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకుని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని గుర్తుచేశారు. ఇలాంటి వాస్తవాలను విస్మరించిన మందకృష్ణ మాదిగ మాదిగల ఓట్లు దండుకోవడాని మోసం చేస్తున్న బీజేపీని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మాదిగలకు న్యాయం చేస్తానంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్‌ అంటూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని తెలిపారు.

Spread the love