Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకళలే పీఎన్‌ఎం పోరాట ఆయుధాలు

కళలే పీఎన్‌ఎం పోరాట ఆయుధాలు

- Advertisement -

సమాజంలో మార్పు కోసం నిస్వార్థంగా అంకితం
ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్‌ కెవి.రమణ
జనవరి 5 నుంచి ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు పీఎన్‌ఎం బ్రోచర్‌ విడుదల

నవతెలంగాణ-కల్చరల్‌
ప్రజానాట్యమండలి (పీఎన్‌ఎం) రాష్ట్ర మూడో మహాసభలు జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికపై నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్‌ కెవి.రమణ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను శుక్రవారం మాసబ్‌ ట్యాంక్‌ వద్దనున్న నఫీజ్‌ రెసిడెన్స్‌లోని ఆయన నివాస కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజం లో మార్పు కోసం నిస్వార్థంగా అంకితమైన ప్రజానాట్యమండలి ప్రజల కోసం, వారి చైతన్యం కోసం పని చేస్తోందన్నారు. పీఎన్‌ఎం కళాకారులు సామాన్య స్థాయిలో ఉన్నా అసామాన్యంగా ఆదర్శవంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు.

కళాకారుడు పాడే పాట అందరికీ ఆనందం ఇస్తుంది. అలాంటి కళాకారుల స్థితిగతులను పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జానపద కళా రూపాల పరిరక్షణకు పాటుపడుతూనే ప్రజలకు చేరువయ్యేందుకు పీఎన్‌ఎం ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు.పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ మాట్లాడుతూ.. గరికపాటి రాజారావు తదితరుల ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ప్రజానాట్యమండలి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014లో తొలి రాష్ట్ర మహాసభ రమణాచారి అధ్యక్షతన విజయవంతంగా జరుపుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మూడో మహాసభలకూ చైర్మెన్‌గా ఆయన అందిస్తున్న సహకారం, సలహాలకు ధన్యవాదాలు తెలిపారు.

స్వాగతం పలికిన సమన్వయకర్త ఎన్‌.మారన్న మాట్లాడుతూ.. నటుడు మాదాల రవి రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృ తిక సారథి చైర్మెన్‌ వెన్నెల గద్దర్‌, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, నవతెలంగాణ సంపాదకులు ఆర్‌.రమేష్‌ తదితరులు చీఫ్‌ ప్యాట్రన్స్‌గా, మరో 20 మంది ప్రముఖులు ప్యాట్రన్స్‌గా ఉన్నారని తెలిపారు. మహాసభలో 600 ప్రతినిధులు, మరో 600 మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు వి.ఆనంద్‌ సినారె గజల్‌తోపాటు ప్రజానాట్యమండలి గీతాన్ని ఆలపించారు. కళ్యాణ్‌, నరేష్‌, గోపాల్‌, భాస్కర, రాము, క్రాంతి, శంకర్‌, సిర్ప లింగం, గడ్డం గణేష, వినోద్‌, నాగ భూషణం, శివ, ముకుంద ఐలయ్య, విజయ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -