న్యూఢిల్లీ : కమ్యూనిస్టు యోధుడు, ప్రజల ప్రియతమ నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు అరుణాంజలి ఘటించారు. ఏచూరి ప్రథమ వర్ధంతిని ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 12 మధ్య పాటించాల్సిందిగా భారత కమ్యూ నిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ గత సమావేశంలో పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ పిలుపులో భాగంగా, పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ కార్యాలయం, ప్రజా సంఘాల నుంచి పనిచేస్తున్న ఇతర నేతలు, కార్యకర్తలు అందరూ మంగళవారం ఉదయం న్యూఢిల్లీలోని ఎకె గోపాలన్ భవన్‌లో ఉన్న కేంద్ర కమిటీ కార్యాలయంలో సమావేశమై సీతారాం ఏచూరికి పుష్పాంజలి ఘటించారు. దేశవ్యాప్తం గానూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీలు, కార్మిక, ప్రజా సంఘాలూ వివిధ రూపాల్లో ఆయనకు ఘన నివాళులర్పించాయి.