Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందోచుకున్నోళ్లకు దోచుకున్నంత..

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత..

- Advertisement -

– ఆన్‌లైన్‌ ఇసుక దందా
– నిఘా లేదు.. నియంత్రణ కరువు
– ఇబ్బందుల్లో లారీ యజమానులు
నవతెలంగాణ- ఉప్పల్‌

ఇసుక రవాణాలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అనేలా ఆన్‌లైన్‌ దందా సాగుతోంది. అధికారుల నిఘా కానీ, నియంత్రణ కానీ లేక లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణాలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, మాఫియాను నియంత్రించి ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించాలనే లక్ష్యంతో గతంలో ఆన్‌లైన్‌ విధానం ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే, ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసే కొందరు నిర్వాహకులు రూ.5వేలు ఇస్తేనే బుకింగ్‌ చేస్తామని లారీ యజమానులను డిమాండ్‌ చేస్తుండటంపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలుగుల, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో అన్నారం, సుబ్బాముపేట, వీరాపురం, గొల్లగూడం, చింతకుంట, ములుగులోని ధర్మవరం, మల్లూరు కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లోని క్వారీలలోని కోర్‌ సాండ్‌, ఫైన్‌ సాండ్‌ ఇసుక రిలీజ్‌ అవుతోంది. బుకింగ్‌ నిర్వాహకులు వివిధ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తూ తమకు అనుకూలమైన విధంగా త్వరగా స్లాట్‌ బుకింగ్‌ చేసి డీడీ చేస్తున్నారు. 16 టైర్‌ల లారీకి ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు రూ.14,300, 14 టైర్‌ల లారీకి రూ.13,150 ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే, డిమాండ్‌ ఉన్న క్వారీల ఇసుక కావాలంటే రూ.5000 ఇస్తేనే బుకింగ్‌ చేస్తామంటూ లారీ యజమానులను వారు డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


స్టాక్‌ ఉండదు.. డీడీ బుకింగ్‌ కాదు
వర్షాకాలం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాదీ వేసవి కాలంలో జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, ములుగు కరీంనగర్‌, పెద్దపెల్లి జిల్లాల క్వారీలలో డంపింగ్‌ చేసి నిల్వ ఉంచేవారు. నిల్వ ఉంచిన స్టాక్‌ను వర్షాకాలంలో ఉపయోగించేవారు. ఈ సంవత్సరం ఏ క్వారీలో చూసినా డంపింగ్‌ నిల్వ లేకపోవడంతో స్టాక్‌ పెట్టడం లేదు. అక్కడ లోడింగ్‌ కావడం లేదు. ఒక్క లారీ లోడ్‌ కావడానికి పది రోజుల సమయం పడుతోంది. దీంతో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నెలలో ఒక్క లారీకి 3 లేదా 4 ట్రిప్పులు బుకింగ్‌ అవుతున్నాయి. ఒక్కొక్క లారీకి ఫైనాన్స్‌ లక్ష 50 వేల రూపాయలు చెల్లించాలి. దాంతో లారీ యజమానులు ఫైనాన్స్‌లు కట్టలేక రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి :
రామంతాపూర్‌ ఉప్పల్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ప్రతాప్‌ రెడ్డి
చినుకుపడితే చాలు.. అది సాకుగా చూపుతూ ఆన్‌లైన్‌ నిర్వాహకులు రూ.5000 ఇస్తేనే డీడీ బుకింగ్‌ చేస్తామంటున్నారు. వీరిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -