దోహదపడిన బీరేన్‌సింగ్ ప్రభుత్వ వైఫల్యాలు
కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు, కేంద్ర సంస్థలు
మణిపూర్ హింస, అల్లర్లపై పీయూసీఎల్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : మణిపూర్‌లో 2023 మే 3న తలెత్తిన హింస, ఘర్షణలు ఆకస్మికంగా, యాధృచ్ఛికంగా జరిగినవి కావని, ఒక ప్రణాళిక ప్రకారం, జాతులను లక్ష్యంగా చేసుకుని సాగించినవని పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్) నివేదిక నిర్ధారణకు వచ్చింది. ఇందుకు బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ వైపల్యాలు కూడా దోహదపడ్డాయని తెలిపింది. మణిపూర్‌లో సాగుతున్న జాతుల ఘర్షణలపై ఇండిపెండెంట్ పీపుల్స్ ట్రిబ్యునల్ 694 పేజీల నివేదికను బుధవారం వెలువరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ఈ నివేదికను రూపొందించారు.
వేలాదిమంది అభిప్రాయాలను విని…
నివేదిక నిష్పక్షపాతంగా వుండేందుకు గానూ మణిపూర్‌కు వెలుపల గల ప్రముఖులైన న్యాయ నిపుణులను ఎంచుకుని గతేడాది పీయూసీఎల్, ఇండిపెండెంట్ పీపుల్స్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ ఎదుట 150 మందికి పైగా బాధితులు మౌఖికంగా సాక్ష్యమిచ్చారు. వేలాదిమంది రాతపూర్వకంగా తమ అనుభవాలు, అభిప్రాయాలు తెలియజేశారు. పలుమార్లు గ్రూపు డిస్కషన్లు జరిగాయి. ”వారందరి గొంతుకలు విన్నాం.” అని జ్యూరీ ఆ నివేదికలో పేర్కొంది. హింస, ఘర్షణలు జరిగి 27మాసాలైన తర్వాత కూడా అంతర్గతంగా నిర్వాసితులై ప్రస్తుతం శిబిరాల్లో తల దాచుకుని, కనుచూపు మేరలో పరిష్కారాలు కానరాక ఇబ్బందులు పడుతున్న 60వేలమందికి పైగా ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు.
హింసకు బీజం వేసిన కారణాలు
దీర్ఘకాలంగా నెలకొని వున్న జాతుల మధ్య విభేదాలను, సామాజిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని, భూ వివాదాలను నివేదిక గుర్తించింది. ఇవే హింసకు బీజం వేశాయని పేర్కొంది. వ్యవస్థాగతంగా సాగే విద్వేష ప్రచారాలు, రాజకీయ వాగాడంబరాలతో ఇవన్నీ మరింత పెచ్చరిల్లాయని తెలిపింది. దాంతో మెయితీ, కుకీ-జో కమ్యూనిటీల మధ్య అపనమ్మకం, విద్వేషం పెరుగుతూ వచ్చాయని నివేదిక అభిప్రాయపడింది.
మెయితీలకు ఎస్‌టీ హోదాను సిఫారసు చేస్తూ మణిపూర్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు 2023 మార్చి 27న ప్రధానమైన వివాదం రేకెత్తడానికి కారణమయ్యాయి. ఈ ఆదేశాలు గిరిజన గ్రూపుల్లో ముఖ్యంగా కుకీలు, నాగాల్లో భయాందోళనలు రేకెత్తించాయి. తమ రాజ్యాంగబద్ధమైన రక్షణలు తుడిచిపెట్టుకుపోతాయని వారు భయపడ్డారని నివేదిక పేర్కొంది. కోర్టు తీర్పు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని నివేదిక వ్యాఖ్యానించింది. దీంతో మే 3న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఆ నిరసనలు అత్యంత త్వరగా లక్షిత హింసాకాండకు దారి తీశాయని నివేదిక పేర్కొంది. కుకీలు మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులని, వారు గంజాయి సాగు చేస్తున్నారనే అబద్ధపు ప్రచారాన్ని ఈ నివేదిక పటాపంచలు చేసింది. ఆ రెండు వాదనలు కూడా అతిశయోక్తితో చేసినవేనని, రాజకీయంగా ఆయుధాలుగా వాడేందుకు ఉపయోగించేవే అని నివేదిక స్పష్టం చేసింది. కుకీల కమ్యూనిటీని దెబ్బతీయడానికే ఇవి ఉపయోగపడ్డాయని తెలిపింది.
కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు
శాంతి భద్రతల యంత్రాంగంపై నివేదిక ఇచ్చిన నిర్ధారణలు చాలా తీవ్రంగా వున్నాయి. ఎంపిక చేసిన వారిపైనే ఎఫ్‌ఐఆర్‌లు పెట్టారు. దర్యాప్తుల్లో అసాధారణమైన జాప్యాలు, భద్రతా బలగాలు ఉదాసీనంగా వ్యవహరించాయని నివేదిక పేర్కొంది. నిష్పాక్షిక ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నివేదిక విమర్శించింది.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా సరిపోలేదు. గీతా మిట్టల్ కమిటీ, సిబిఐ పరిమిత దర్యాప్తులతో పెద్దగా ఉపయోగంలేదు. పేలవమైన వనరులు, తదనంతర కార్యాచరణ లోపించడం ప్రధానంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. జాతుల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేసేలా వ్యవహరించాయంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అభిశంసనలు ఎదురయ్యాయి.
పాశవికత, ఉదాసీనత
బాధితులు ఇచ్చిన సాక్ష్యాధారాలు మరికొన్ని భయం గొలిపే వాస్తవాలను వెల్లడించాయి. ”హత్యలను, శరీర భాగాలను నరికివేయడం, మహిళలను వివస్త్రలుగా చేయడం, లైంగిక హింస, వేధింపులు, అవమానాలు పెద్ద ఎత్తున చూశాం” అని అనేకమంది మహిళలు సాక్ష్యమిచ్చారు. తమకు సాయం చేయడంలో పోలీసులు ప్రతీసారీ విఫలమయ్యారని వారు విమర్శించారు. కొన్నిసార్లయితే తమను వారే అల్లరి మూకలకు అప్పగించిన సందర్బాలు కూడా వున్నాయని వారు వాపోయారు.
న్యాయం, శాంతికి సిఫారసులు
మణిపూర్ ప్రజల్లో జవాబుదారీతనాన్ని, విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సి వుందని నివేదిక పేర్కొంది. కొండ ప్రాంత జిల్లాల్లో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని, వేలాదిగా పెండింగ్‌లో వున్న కేసుల పరిష్కారానికి స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని సిఫారసు చేసింది. హింసకు ఆజ్యం పోస్తున్న విద్వేష ప్రచారాన్ని, ప్రసంగాలను కఠినంగా ప్రాసిక్యూట్ చేయాలని కోరింది. ఉపశమన, సహాయక చర్యలను బలోపేతం చేయాలని సూచించింది. కమ్యూనిటీల మధ్య చర్చలను కొనసాగించాలని, అప్పుడే పెరుగుతున్న విభజనలు, విభేదాలు సమసిపోవడానికి అవకాశం వుంటుందని పేర్కొంది. వ్యవస్థాగత స్పందన రాకుండా శాంతిని పునరుద్ధరించలేమని చివరగా నివేదిక వ్యాఖ్యానించింది. మణిపూర్ ప్రజలు ఈ అరకొర చర్యల కన్నా మించి అర్హులని ప్రకటించింది.
విద్వేష ప్రచారానిదే కీలక పాత్ర
విద్వేష ప్రచారమనేది కీలకపాత్ర పోషించింది. రెచ్చగొట్టే సమాచారంతో సోషల్ మీడియా నిండిపోయింది. పక్షపాతంతో కూడిన ప్రింట్ మీడియా ఇచ్చిన వార్తా కథనాలతో విభజనలు మరింత పెచ్చరిల్లాయని నివేదిక తెలిపింది. హింస జరుగుతోందని తెలిసినా ప్రభుత్వం దాన్ని ఆపడానికి ఏమీ చేయలేదని ఒక మహిళ జ్యూరీకి తెలిపింది.
సహాయక చర్యలేవీ?
ఇక ప్రభుత్వం వైపు నుంచి సహాయక చర్యలు కుప్పకూలడంతో బాధితుల ఇబ్బందులు, కష్టాలు మరింత పెరిగాయి. ”శిబిరాల్లో మౌలిక పారిశుధ్యం లోపించింది. ఆహారం, వైద్య సదుపాయాలు లేవు. ఆస్పత్రులపై కూడా దాడులు జరిగాయి. దాంతో సిబ్బంది పారిపోయారు. రోగులకు కుల, మత ప్రాతిపదికన చికిత్సలు నిరాకరించేవారు” అని నివేదిక పేర్కొంది. బాధితుల్లో మానసిక రుగ్మతలు కూడా తలెత్తాయని పేర్కొంది.
ప్రణాళిక ప్రకారమే
- Advertisement -
- Advertisement -