Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'టాక్సిక్‌..'లో రెబెకాగా..

‘టాక్సిక్‌..’లో రెబెకాగా..

- Advertisement -

యష్‌ నటిస్తున్న నూతన చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తున్న కియారా అద్వానీ.. మిస్టీరియస్‌, గ్లామరస్‌ ఎలిజిబెత్‌ పాత్ర పోషిస్తున్న హుమా ఖురేషి.. పవర్‌ఫుల్‌ గంగ పాత్రలో నయనతార పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదలై ఈ సినిమాలోని డార్క్‌ వరల్డ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచేశాయి. తాజాగా మేకర్స్‌ అందమైన, ఆకర్షణీయమైన, సున్నితమైన రెబెకా పాత్రలో నటిస్తున్న తారా సుతారియా పాత్రను పరిచయం చేశారు. ఇలా సినిమాలోని పాత్రలను పరిచయం చేయటం ద్వారా.. సినిమా స్కేల్‌ పాన్‌ ఇండియా రేంజ్‌ను తెలియజేస్తోంది. ఇందులో హై యాక్షన్‌ సీక్వెన్సెస్‌, భారీ డ్రామా, కథలోని అనేక మలుపులుండబోతున్నాయి. తాజాగా తారా సుతారియా లుక్‌ను రివీల్‌ చేశారు. ఇది ఆమెకు తొలి పాన్‌ ఇండియా మూవీ. ఆమె కెరీర్‌లో ఇదొక కొత్త అధ్యాయం. పోస్టర్‌ చూస్తుంటే తనను తాను రక్షించుకోగల ధైర్యం, సామర్థ్యమున్న పాత్రలో ఆమె మెప్పించనుంది. అందమైన అమ్మాయిగా టాక్సిక్‌ అనే ప్రమాదకరమైన, కఠినమైన ప్రపంచంలోకి అడుగు పెడుతుంది.

ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ, ‘నటిగా తారాకి ఇది కావాలని బలంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు కావాల్సినంత స్వేచ్చను ఇస్తే చాలు. అదే నేను చేశాను. ఆమె ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించేది. పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించేది. ఆమెను ఎలా గైడ్‌ చేయాలా ? అని నేను ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆమె పాత్రలో అద్భుతంగా జీవించింది. ఇది నన్నెంతో ఆశ్చర్యపరిచింది. నన్నే కాదు.. అందరినీ ఇది ఆశ్చర్యపరుస్తుందనటంలో సందేహం లేదు’ అని అన్నారు. యష్‌, గీతూ మోహన్‌దాస్‌ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఇంగ్లీష్‌, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ నిర్మిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -