Sunday, July 13, 2025
E-PAPER
Homeజాతీయంఇంధన స్విచ్‌లు ఆగిపోవడంతోనే…సరఫరా ఆగిపోయింది

ఇంధన స్విచ్‌లు ఆగిపోవడంతోనే…సరఫరా ఆగిపోయింది

- Advertisement -

– ఎలాంటి కుట్ర కోణం లేదు.. పక్షి ఢకొీట్ట లేదు
– అహ్మదాబాద్‌ విమానం దుర్ఘటనపై
– ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో అంశాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో : ఇంధన స్విచ్‌లు ఆగిపోవడంతోనే అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిందని దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. ఈ దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదికను శనివారం విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్‌ అయిన సెకను వ్యవధిలోనే రెండు ఇంధన కటాఫ్‌ స్విచ్‌లు ఆఫ్‌ అయ్యాయి. దీంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఫ్యూయల్‌ కట్‌ ఆఫ్‌ స్విచ్‌లు.. రన్‌ నుంచి కటాఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. అది కేవలం సెకన్‌లోనే జరిగిపోయింది. దీంతో ఇంజిన్లు గాలిలోనే నియంత్రణ కోల్పోయాయని ఎఎఐబి పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పూర్తిగా పరిశీలించామని, విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికి తీశామని తెలిపింది. వాటిని భద్రపరిచినట్టు పేర్కొంది.
ప్రమాదానికి ముందు విమానంలో ఫ్యూయెల్‌, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవు. రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోయే ముందు విమానం 180 నాట్ల గరిష్ట వేగానికి చేరుకుందని వెల్లడించింది. అయితే ఇంధన స్విచ్‌లు ఆగిపోవడంతో వేగం, ఎత్తులో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయనీ, అంతేతప్ప ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. విమానంపై దాడి జరిగినట్టు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని వివరించింది. ఫ్యూయల్‌ స్విచ్‌లో లోపాలు ఉన్నట్టు ఎఫ్‌ఎఎ అడ్వైజరీతో తెలుస్తోందని పేర్కొంది. ఎయిర్‌ ఇండియా రెగ్యులర్‌ ఇన్‌స్పెక్షన్లు చేయలేదని, విమానం బరువు, బ్యాలెన్స్‌ పరిమితులకు తగినట్టే ఉన్నా అందులో ప్రమాదకర వస్తువులు కూడా లేవని తెలిపింది. అంతేకాక ఆ నివేదికలో విమానంలో కాక్‌పిట్‌ ఆడియో సంభాషణ విడుదల చేశారనీ, అందులో ఓ పైలట్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని ఆ పైలట్‌ సమాధానం ఇచ్చాడని పేర్కొంది.
కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్‌ ఇచ్చారని, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఎటిసి) స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. ఈలోపే విమానం కూలిపోయిందని పేర్కొంది. ఇంజిన్లకు పవర్‌ సప్లరు ఆగిపోవడంతో.. రామ్‌ ఎయిర్‌ టర్బైన్‌.. ఓ చిన్నపాటి ప్రొపెల్లర్‌ లాంటి డివైస్‌ను ఆన్‌ చేశారు.
ఆటోమెటిక్‌గా ఆ డివైస్‌ హైడ్రాలిక్‌ పవర్‌ను సరఫరా చేస్తున్నది. ఎఎఐబి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా.. ఆర్‌ఎటిని వినియోగించినట్టు తెలుస్తోంది. ఇంజిన్లను రిస్టార్ట్‌ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించారు. ఎన్‌1 లేదా ఇంజిన్‌ 1.. పాక్షికంగా రికవరీ అయింది. కానీ కూలడానికి ముందు ఇంజిన్‌ 2 మాత్రం రికవరీ కాలేకపోయినట్లు రిపోర్టులో తేలింది. కేవలం 32 సెకన్లు మాత్రమే విమానం గాలిలో ఎగిరిందని, రన్‌వేకు 0.9 ఎన్‌ఎం దూరంలో విమానం కూలి ఓ హాస్టల్‌పై పడిందని,థ్రస్ట్‌ లివర్స్‌ ఐడిల్‌గా ఉన్నట్టు గుర్తించారని తెలిపింది. కానీ టేకాఫ్‌ సమయంలో థ్రస్ట్‌ ఆన్‌లో ఉన్నట్టు బ్లాక్‌బాక్సుతో తెలుస్తోందని వివరించింది.
టేకాఫ్‌ సమయంలో ఫ్లాప్‌ సెట్టింగ్‌ (5 డిగ్రీలు), రియర్‌(డౌన్‌) సాధారణంగా ఉన్నట్టు తేల్చింది. పక్షి ఢకొీట్టడం కానీ.. విమానం ప్రయాణిస్తున్న మార్గంలో పక్షులు తిరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. ఆకాశం కూడా క్లియర్‌గా ఉందని, విజిబులిటీ బాగుందని, గాలి స్వల్పంగా వీస్తుందని, పైలెట్ల ట్రాక్‌ రికార్డు కూడా క్లియర్‌గా ఉందని పేర్కొంది. అంతేకాక ఇద్దరూ మెడికల్‌గా ఫిట్‌ ఉన్నారని, కావాల్సినంత అనుభవం ఉందని తెలిపింది.
నివేదికపై బోయింగ్‌ సంస్థ స్పందన
ఇంధన సరఫరా స్విచ్‌లో లోపం తలెత్తినట్టు ఎఎఐబి సమర్పించిన నివేదికపై బోయింగ్‌ సంస్థ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. విచారణకు, తమ కస్టమర్‌కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రొటోకాల్‌ ప్రకారం.. ఎఐ-171కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎఎఐబికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైందని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -