సమస్యలపైన స్పష్టత రాని చర్చలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 25న తలపెట్టిన ఛలో సచివాలయ ముట్టడి యధావిధిగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఐసీడీఎస్ డైరెక్టర్ సృజన సమక్షంలో జరిగిన చర్చల్లో స్పష్టమైన హామీలు రాలేదని తెలిపారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్య పైనా, వేతనాల పెంపు పైనా హామీలు రాలేదన్నారు. రిటైర్మెంట్ జీవో నెం.8 సవరణ, మినీ టీచర్స్ ఏరియర్స్, 24 రోజుల సమ్మె వేతనాలు, పీఆర్సీ ఏరియర్స్, సీబీఈ 10 నెలల బకాయిలు, కారుణ్య నియామకాలు, మట్టి ఖర్చులు, జీవో నెం 11 సవరణ చేసే విధంగా చూస్తామని మాత్రమే చెప్పారని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలనీ, ఒకే ఆన్‌లైన్ యాప్ ఉండాలనీ, 5జీ నెట్‌వర్క్‌తో కూడిన మొబైల్ ఫోన్ ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందిస్తూ 20 రోజుల్లో ఇస్తామని హామీనిచ్చారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చర్చిస్తామన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని కోరగా పదో తేదీగా ఇస్తామని చెప్పారన్నారు.
దసరా సెలవులపైనా స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. సీనియార్టీ ప్రకారం వేతనాలు నిర్ణయించాలని కోరగా పరిశీలిస్తామంటూ దాటవేశారని చెప్పారు. ఒకే రకమైన నాణ్యమైన యూనిఫాం, బీఎల్‌ఓ డ్యూటీల రద్దు, సంక్షేమ పథకాలు అమలు, 2017 నుంచి ఆగిపోయిన టీఏ, డీఏలు, ఇంక్రిమెంట్ ఇంచార్జ్ అలవెన్సుల విషయంలోనూ పరిశీలిస్తామని మాత్రమే అన్నారన్నారు. చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అమౌంట్ అందట్లేదని తెలియజేయగా దానిపైనా చర్చించి ఎవరు చెల్లించాలనే అంశంపైన క్లారిటీ ఇస్తామని చెప్పారు. డిమాండ్లను నెరవేర్చే విషయంపై చూస్తాం..పరిశీలిస్తాం…పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని మాత్రమే చెప్పారుగానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. గతంలో తమ యూనియన్ ప్రకటించిన విధంగానే యధావిధిగా పోరాటాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో తమతో పాటు యూనియన్ రాష్ట్ర కోశాధికారి పి.మంగ, రాష్ట్ర సహాయ కార్యదర్శి స్వప్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు సమ్మక్క, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్ రమాకుమారి పాల్గొన్నారని తెలిపారు.