Sunday, November 16, 2025
E-PAPER
Homeమానవివయసు పెరుగుతుంటే..?

వయసు పెరుగుతుంటే..?

- Advertisement -

45 ఏండ్లకు చేరువైన గాయత్రికి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా చెమటలు పడుతుంటాయి, ఎవరు పలకరించినా చిరాకు పడుతుంది… ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటాయని చాలా బాధపడుతూ చెబుతుంది. అంతేకాదు ఈ సమస్యలకు తోడు ఈ మధ్య రుతుస్రావం కూడా అస్తవ్యస్తంగా మారింది. ఇవన్నీ కలిసి ఆమెను మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

ఇలాంటి సమస్య ఒక్క గాయత్రికి మాత్రమే కాదు ఆ వయసులో అంటే మెనోపాజ్‌కు చేరువవుతోన్న మహిళల్లో రకరకాల సమస్యలు కనబడుతుంటాయి. అయితే వీటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల తమకేదో జరిగిపోతోందని ఆందోళన చెందుతుంటారు. కొందరైతే సమస్యలు బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. ఇంకొందరైతే ఇంట్లో వాళ్లకు, సన్నిహితులకే కాదు చివరకు డాక్టర్‌కు చెప్పుకోవడానికి కూడా మొహమాట పడుతుంటారు. ఈ మొహమాటం, సిగ్గు, బిడియం వదిలిపెట్టి మెనోపాజ్‌ గురించి ముందుగానే అవగాహన పెంచుకుంటే. ఈ దశలోనూ ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉంచవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం డాక్టర్‌ను సంప్రదించి మెనోపాజ్‌ గురించి కొన్ని ప్రశ్నలు అడగడం తప్పనిసరి అంటున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం
ప్రతి మహిళ జీవితంలో మెనోపాజ్‌ సహజం. సాధారణంగా 40-50 ఏండ్ల మధ్య వయసున్న మహిళలు ఈ దశకు చేరుకుంటారు. కొంతమందిలో ఇంకా ముందే ఈ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌గా పిలుస్తారు. ఏదేమైనా ఈ దశలోకి ప్రవేశించే క్రమంలో మహిళల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. నెలసరి క్రమం తప్పడం, రాత్రుళ్లు ఉన్నట్టుండి చెమటలు పట్టడం, యోని పొడిబారిపోవడం, లైంగిక కోరికలు తగ్గిపోవడం, అలసట, నీరసం, చిరాకు, ఒత్తిడి, జీర్ణ సంబంధిత సమస్యలు… ఇలా ఈ దశలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

నిజానికి ఈ సమస్యలన్నీ సహజంగా తలెత్తేవే అయినా వీటిని అదుపు చేసుకొని ఆరోగ్యంగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలూ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించే మహిళలు ముందుగానే వీటి గురించి డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. అలాగే ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులేంటో తెలుసుకొని ముందు నుంచే వాటిని పాటించాలి. అప్పుడే మెనోపాజ్‌ దశను ఏలాంటి సమస్యలూ లేకుండా ప్రశాంతంగా దాటేయవచ్చు.

అవగాహన పెంచుకోండి
మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించే మహిళల శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో జరిగే మార్పుల వల్లే ఆయా లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని దూరం చేసుకోవడానికి కొంతమంది హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తుంటారు. నిజానికి ఇవి అవసరమా? అవి మీ శరీరతత్వానికి నప్పుతాయా? అన్న విషయం డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు వీటి వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి కూడా అవగాహన పెంచుకుంటే మీ చుట్టూ ఉన్న మహిళలకు వీటి గురించి చెప్పవచ్చు. ఇక హార్మోన్‌ థెరపీ తీసుకోని వారు వీటికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర మార్గాల గురించి డాక్టర్‌ని అడిగి తెలుసుకోవడం మంచిది.

హృదయం జాగ్రత్తా
మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించిన మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ దశలో ఆస్టియోపొరోసిస్‌ బారిన పడేవారూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అందుకే వీటి గురించి ముందుగానే అవగాహన పెంచుకోవడం వల్ల గుండె, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. అలాగే ఆయా అవయవాల పనితీరు, ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలో వైద్యులను అడిగి చేయించుకోవాలి. ఏవైనా సమస్యలుంటే వాటికి ముందులు వాడడం, ఆహారం, వ్యాయామ నియమాల్లో చేసుకోవాల్సిన మార్పుల గురించి కూడా అడిగి తెలుసుకోవాలి. వాటిని తప్పకుండా పాటించాలి. ఇలా చేసుకొనే మార్పులే మీ గుండె, ఎముకల్నీ దృఢంగా చేస్తాయి. అలాగా మెనోపాజ్‌ దశలోనూ సౌకర్యవతంగా మిమ్మల్ని ఉంచుతాయి.

నిర్లక్ష్యం వద్దు
ఈ దశలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ వంటి లైంగిక హార్మోన్ల స్థాయిలు చాలా వరకు తగ్గిపోతాయి. దీనివల్ల కొందరిలో యోని పొడిబారిపోయి కోరికలు తగ్గిపోతాయి. ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే లైంగిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మీ అనుబంధానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా మీ సమస్యలను వైద్యులతో చెప్పి తగు పరిష్కారాలు తెలుసుకోండి. అలాగే ఈ దశలో కొంతమంది వివిధ రకాల చికిత్సలు తీసుకోవడం, లూబ్రికెంట్స్‌ క్రీములు వాడుతుంటారు. వీటిని వాడే ముందు కచ్చితంగా డాక్టర్ల సూచనలు తీసుకోవాలి.

ఇవి తెలుసుకోండి
వయసు పెరిగే కొద్దీ మహిళల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించే మహిళల్లో క్యాన్సర్ల ముప్పు ఎక్కువని నిపుణులు అంటున్నారు. కనుక ఈ దశలో ఏయే క్యాన్సర్ల ముప్పు ఎక్కువా? వాటిని మొదట్లోనే పరిష్కరించుకునేందుకు ఎలాంటి పరిష్కలు చేయించుకోవాలి? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను డాక్టర్లను అడిగి తెలుసుకోవడం ఉత్తమం.

ఒత్తిడి లేకుండా
మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల వల్ల కొందరిలో మానసిక ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి వైద్యులను అడగడం మంచిది. అంతేకాదు మనసు ప్రశాంతంగా ఉండాలంటే నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్రపోవడం, మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించిన మహిళల అనుభవాలు తెలుసుకోవడం ఇలా మన ప్రయత్నం కూడా ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -