Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశా వర్కర్ల 48గంటల నిరవధిక సమ్మె

ఆశా వర్కర్ల 48గంటల నిరవధిక సమ్మె

- Advertisement -

– ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18,000 ఇవ్వాలని డిమాండ్‌
– కలెక్టరేట్ల ముందు మహాధర్నాలు
– అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని వినతి
నవతెలంగాణ -విలేకరులు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18000 ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని, ఎన్‌హెచ్‌ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ల ఎదుట 48 గంటల మహాధర్నాలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆశాల సమస్యలను ఎజెండాగా పెట్టి చర్చించాలని, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కందునూరు శ్రీనివాస్‌, కార్యదర్శి సమ్మెట రాజమౌళి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట 48 గంటల ధర్నా, వంటా వార్పు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ సంపత్‌కు వినతిపత్రం అందజేశారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా, అనంతరం అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందించారు.
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు వంటావార్పు నిర్వహించి ధర్నా చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట 48 గంటల దీక్షలు ప్రారంభించారు. ఆశా యూనియన్‌ కార్యదర్శి సుజాత, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి, కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం ఇచ్చారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్ల ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నా, ఆచరణలో మాత్రం మహిళలను రోడ్డుపైకి తెచ్చిందని విమర్శించారు.
ఆశావర్కర్లకు రూ.18 వేల జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ, ఆశావర్కర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -