Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయం'ఓట్‌ చోరీ'పై అసోం ప్రతిపక్షాల ఫిర్యాదు

‘ఓట్‌ చోరీ’పై అసోం ప్రతిపక్షాల ఫిర్యాదు

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై చర్యకు డిమాండ్‌

గువహతి : అసోంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఐదు ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ‘సర్‌’ ప్రక్రియ ద్వారా బీజేపీ ఓట్‌ చోరీకి పాల్పడుతోందని అందులో ఆరోపించాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్‌, సీపీఐ (ఎం), రాయిజార్‌ దళ్‌, అస్సాం జతియా పరిషత్‌, సీపీఐ (ఎంఎల్‌) పార్టీల నేతలు గౌహతిలోని దిస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదును సమర్పించారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారిని తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కు అయిందని అందులో విమర్శించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామిక హక్కులకు ముప్పుగా పరిణమిస్తాయని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, జాబితాను నిస్పాక్షికంగా సమీక్షించాలని కోరారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రిపన్‌ బోరా విలేకరులతో మాట్లాడుతూ పథకం ప్రకారం జరుగుతున్న కుట్రలో భాగంగానే సర్‌ ప్రక్రియను చేపట్టారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ చట్టాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ సైకియాపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ తనకు తానుగా చర్య తీసుకొని ఉండాల్సిందని, అయితే ఇప్పటి వరకూ ఆ పని చేయనందున ప్రతిపక్షాలన్నీ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాయని చెప్పారు. సైకియా పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ బీజేపీ మద్దతుదారులు కాని వారిని గుర్తించాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు సూచించారని తెలిపారు. సోమవారం లోగా ఆ ఓటర్ల జాబితాను సమర్పించాలని సైకియా ఆదేశాలు జారీ చేశారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు ప్రతిపక్ష పార్టీలు ప్రతినిధులు ఐదు డిమాండ్లతో కూడిన ఐదు పేజీల మెమొరాండంను రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -